అయ్యో.. కవిత ఇక కష్టమే!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను దర్యాప్తు సంస్థలు వెంటాడుతూనే ఉన్నాయ్!. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న కవిత మరోసారి అరెస్టయ్యారు. ఇప్పటి వరకూ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అయితే ఇప్పుడు సీబీఐ వంతు వచ్చేసింది. ఏప్రిల్-06న తీహార్ జైలు వేదికగా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించిన సీబీఐ అధికారులు.. గురువారం నాడు అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. కోర్టుకు కూడా అరెస్ట్ విషయాన్ని తెలిపింది సీబీఐ. రిమాండ్‌లో ఉండగానే అరెస్ట్ అవ్వడంతో ఇక కవిత బయటికి రావడం కష్టమేనని న్యాయ నిపుణులు చెబుతున్న మాట. అయితే.. రేపు అనగా శుక్రవారం నాడు కవితను కోర్టుకు తీసుకెళ్లి.. హాజరుపరచడానికి సీబీఐ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయ్యో.. అన్నీ కష్టాలే!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి.. ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల జంపింగ్‌లు.. ఎంపీ అభ్యర్థులు కండువా మార్చేయడం.. పార్టీకి పరిస్థితి రోజురోజుకూ పడిపోతుండటం.. ఇవన్నీ ఉద్యమ పార్టీకి ఎదురుదెబ్బలే. అయితే.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కవితను అరెస్ట్ చేయడం మరో ఎత్తు. అంతేకాదు.. రిమాండ్‌లో ఉండగా సీబీఐ అరెస్ట్ చేయడం పెను సంచలనంగానే మారింది. ఈ వరుస అరెస్టులు బీఆర్ఎస్‌ను కుదిపేస్తున్నాయి. కవిత ఇప్పట్లో దర్యాప్తు సంస్థలు వదిలేలా లేవని.. ఆమె బయటికి రావడం కష్టమేనని న్యాయ నిపుణులు చెబుతున్న పరిస్థితి. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.