Advertisement
Google Ads BL

జనసేనాని వ్యూహమా.. అదృష్టమా..!?


జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారా..? లేకుంటే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టిందా..? ఇప్పుడిదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. ఓ వైపు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కీలక నేత పోతిన మహేష్ రాజీనామా చేయడం.. ఆ మరుక్షణమే మీడియా మీట్ పెట్టి జనసేన పార్టీ మొదలుకుని.. పవన్‌పై వ్యక్తిగత విషయాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శించడంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి. మహేష్ మాటలను కట్ చేసి మరీ.. సోషల్ మీడియాలో వైరల్ చేసింది వైసీపీ అండ్ కో బ్యాచ్. దీంతో ఒక్కసారిగా జనసేనలో ఏదో జరుగుతోందనే భావన కార్యకర్తలు, నేతల్లో మెదిలింది. సీన్ కట్ చేస్తే.. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఇది నిజంగా సేనాని వ్యూహమా..? లేకుంటే అదృష్టమా అనేది తెలియట్లేదు కానీ.. ఒక్కసారి ఎనలేని జోష్..!

Advertisement
CJ Advs

అసలేం జరిగింది..?

పోతిన మహేశ్.. ఈ పేరు కాస్త ఏపీ రాజకీయాలకు పట్టుకున్న వారికి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. విజయవాడలో జీరో నుంచి ఇప్పుడీ స్థాయికి పార్టీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. తన వాక్చాతుర్యంతో మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలను సైతం గడగడలాడించిన నేత. ఆఖరికి మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావును సొంత నియోజకవర్గం నుంచి తరిమికొట్టి వేరే స్థానం చూసుకునేలా చేశారు. అలాంటి వ్యక్తికి టికెట్ రాకపోవడంతో ఒక్కసారిగా డీలా పడిపోయారు. తీవ్ర అసంతృప్తిలోనై పార్టీలో ఇమడలేనని రాజీనామా చేసి బయటికొచ్చేశారు. అంతటితో ఆగని ఆయన.. నోటికి పనిచెప్పి ఇష్టానుసారం మాట్లాడి లేనిపోని అబండాలు, అవాకులు-చెవాకులు పేల్చారు. పవన్ ఆస్తులు మొదలుకుని భార్య అన్నా లెజినోవా వరకూ అన్ని విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. దీన్నే అదనుగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా, కార్యకర్తలు ఓ రేంజ్‌లో విర్రవీగిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోమవారం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పోతినే హైలైట్ అయ్యారు. సేనానికి నమ్మకస్తుడు ఇలా మాట్లాడుతున్నారేంటని సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా పవన్ మాత్రం పల్లెత్తు మాట కూడా అనకుండా మిన్నకుండిపోయారు. విజయవాడ నుంచి నేరుగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు సేనాని. ఇక్కడే పెద్ద వండర్ జరిగిపోయింది.

మెగా ఎంట్రీ.. మాస్టర్ స్ట్రోక్!

హైదరాబాద్ వచ్చిన సేనాని నేరుగా ముచ్చింతల్‌లో జరుగుతున్న తన అన్న మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ దగ్గరికెళ్లారు. అన్నయ్యకు పాదాభివందనం చేసిన తమ్ముడు ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాదు.. తమ్ముడూ ఎవరున్నా లేకున్నా నేను నీతోనే ఉన్నా అంటూ ఆశీర్వాచనాలిచ్చారు అన్నయ్య. అనంతరం ముగ్గురు అన్నదమ్ములు ఆత్మీయంగా  పకలరించుకున్నారు.. రాజకీయాల గురించి నిశితంగా చర్చించుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఐదు కోట్ల రూపాయిలు చెక్ స్వయంగా చిరునే పవన్‌, నాగబాబులకు ఇచ్చి.. పార్టీ ఫండ్‌గా ఇస్తున్నానని ప్రకటించడం మరో ఎత్తు. ఈ ఒక్క సీన్‌తో ఏపీ పొలిటికల్ సినారియో మొత్తం మారిపోయింది. మెగా ఎంట్రీతో ప్రత్యర్థులు, విమర్శకులకు మాస్టర్ స్ట్రోక్ తగిలినట్టయ్యింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన సినిమాకు చిరు ఎండ్ కార్డ్ పడేశారు. దీంతో పోతిన కామెంట్స్ కనుమరుగై.. జనసేనకు ఎక్కడ లేని మైలేజ్ వచ్చినట్టయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అన్నయ్య, తమ్ముడు గురించే చర్చించుకుంటున్న పరిస్థితి.. చూశారుగా మెగా ఎంట్రీతో మొత్తం ఎలా మారిపోయిందో!

ధర్మ యుద్ధం మొదలైనట్టేనా!

రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత ఎక్కడా పొలిటికల్‌గా కానీ.. ముఖ్యంగా జనసేన గురించి గానీ చిరంజీవి మాట్లాడిన సందర్భాల్లేవ్. అయితే పవన్ ప్రజాసేవ చేయడానికే ఉన్నాడని మాత్రం ఇంటర్వ్యూల్లో చెప్పేవారు చిరు. అయితే మొదటిసారి.. అది కూడా ఎన్నికల ముందు ఇలా అన్నదమ్ములు కలుసుకోవడం, ఆశీస్సులు కోరడం.. ధైర్యం చెప్పి వెన్నుతట్టి ముందుకు పంపడం ఇవన్నీ చూసిన అభిమానులు, కార్యకర్తలు ధర్మ యుద్ధం మొదలైంది.. విశ్వంభర విజృంభణం అంటూ సోషల్ మీడియాలో తెగ రాసేస్తున్నారు. మరోవైపు.. ఇక కాస్కోండి అసలు సిసలైన యుద్ధం మొదలైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీరాముడు-ఆంజనేయుడి ఫొటోల పక్కనే చిరు-పవన్ ఫొటోలతో వీరాభిమానులు వైరల్ చేస్తున్నారు. ఆ సంగతి అటుంచితే.. వాస్తవానికి మెగాభిమానులు రెండుగా చీలిపోయారన్నది జగమెరిగిన సత్యమే. పవన్‌ను అభిమానించే వాళ్లు ఓ వైపు.. చిరు, మోగాభిమానులు మరోవైపు ఉంటూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తిట్టిపోసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోండి. అలాంటిది ఒక్కసారిగా అన్నదమ్ముల కలయిక అదికూడా ఆంజనేయుడి సన్నిధిలో కావడంతో మేమంతా ఒక్కటే.. మీరూ ఏకం కావాల్సిన టైమొచ్చిందనే సందేశాన్ని చిరు పంపినట్లయ్యింది.

సపోర్టు మాత్రమేనా..?

సపోర్టు మాత్రమే సరిపోదు మెగాస్టార్.. ఒక్కసారి ఎన్నికల ప్రచారంలో దర్శనమివ్వండి అని మెగాభిమానుల నుంచి అయితే డిమాండ్ గట్టిగానే వస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా పవన్‌కు సపోర్టుగా ఉందని.. ఒక్క పిలుపు వస్తే బాబాయ్.. మామయ్య కోసం వచ్చేస్తామని అబ్బాయిలు, మేనల్లుడు చెప్పేశారు కూడా. పనిలో పనిగా చిరు కూడా ఒక్కసారి అలా వచ్చి ఇలా మెరుపుతీగలా మెరిసిపోతే బాగుంటుందన్నది ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా కోరుకుంటున్నారు. సపోర్టే చేసిన తర్వాత ఇక ప్రచారం పెద్ద విషయమేమీ కాదు.. జనాల ముందుకొచ్చే కాదు సోషల్ మీడియా ద్వారా ఒక్క ప్రకటన చేసినా సరిపోతుందిగా.!. పవన్‌కు ఆశీర్వచనాలు, ఐదుకోట్ల చెక్ ఇచ్చాక సేనానిని ఆకాశానికెత్తుతూ చిరు చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇలాంటి ఒకట్రెండు ట్వీట్స్ ఇలా చేస్తే అదే ఫ్యాన్స్‌కు పదివేలు అన్నయ్యా!. మొత్తానికి ఇన్నిరోజులుగా మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు.. వీరాభిమానుల్లో ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్నలకు ఒకే ఒక్క కలయికతో సమాధానం దొరికిపోయింది. పార్టీపై ఉన్న నెగిటివ్ కూడా ఒక్కసారిగా పోయి.. పెద్ద ప్లస్ అయ్యింది. ఇదంతా జనసేనాని వ్యూహమో.. అదృష్టమో.. అంతకుమించి అనేది తెలియట్లేదు కానీ.. కార్యకర్తలు, మెగాభిమానుల్లో మాత్రం యమా కిక్కు, జోష్ ఇచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక ఇదే జోష్‌తో పవన్‌ను గెలిపించి చట్టసభలకు పంపించాల్సిన బాధ్యత ఫ్యాన్స్‌ గట్టిగానే ఉంది.

JanaSena strategy.. or luck..!?:

Janasena: Mega Entry.. Master Stroke!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs