జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా పొలిటికల్ గా సభలు, సమావేశాలతో బిజీగా కనిపించారు. అనకాపల్లి లో టీడీపీ కూటమి తరఫున ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా అనకాపల్లి సభలో ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని, పరిశ్రమల మంత్రిగా అనకాపల్లికి చెందిన గుడివాడ అమర్నాధ్ ని ఆయన తన డైలాగ్స్ తో ఓ ఆట ఆడుకున్నారు. కోడి గుడ్డు పెట్టాలంటే పొదగాలి అంటూ చాలా ప్రోసెస్ ఉందని, అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు కోడి గుడ్డు గుర్తొస్తుంది అంటూ వెటకారం చేసారు.
ఇదంతా ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరాన పడి కోలుకుని మళ్ళీ ప్రచారం మొదలు పెట్టారు. ఎండలో తిరగడంతో జ్వరం పదే పదే ఆయన్ని ఇబ్బంది పెట్టింది. అయితే జ్వరం తగ్గింది కదా అని పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లోకి దిగిపోయి, మళ్ళీ ఎండలో మీటింగ్స్ పెట్టడంతో.. నిన్న అనకాపల్లి సభ జరిగిన తర్వాత వైజాగ్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా కారు లో పవన్ కళ్యాణ్ సొమ్మసిల్లి పడిపోయారు.
కొద్దిగా తేరుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ టెస్ట్ లు అవి చేయించుకుని తిరిగి ఏపీకి పయనమవుతారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అలా స్పృహ తప్పిపోవడానికి వడదెబ్బే కారణమంటున్నారు. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురి కావడంతో జనసైనికులు కాస్త కంగారు పడ్డారు.