రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటే ఈమధ్యన చాలామందికి పడడం లేదు. చాలా తక్కువ సమయంలో ఇండస్ట్రీలో సోలోగా అంటే ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో రీసెంట్ టైమ్స్ లో విపరీతమైన నెగిటివిటి కనిపిస్తూనే ఉంది. విజయ్ దేవరకొండ సినిమా విడుదలవుతుంది అనగానే కొంతమంది విజయ్ సినిమాపై విషం కక్కుతున్నారు. లైగర్, ఖుషి సినిమా లు విడుదలైన నెక్స్ట్ మినిట్ సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూస్ కనిపించాయి.
ఇప్పుడు విజయ్ దేవరకొండ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ లా ఫ్యామిలీ స్టార్ ని పబ్లిసిటీ చేసుకున్నాడు. ఎక్కడా ఎక్కువ తక్కువ అన్నట్టుగా కాకుండా చాలా పద్దతిగా కనిపించాడు. లైగర్ మూవీ తర్వాత మూడు సినిమాల వరకు మూసుకు కూర్చుంటా అన్నాడు. అయినా సోషల్ మీడియాలో విజయ్ పై ఎలాంటి సింపతీ క్రియేట్ అవలేదు సరి కదా.. ఫ్యామిలీ స్టార్ విడుదలైన మరుక్షణమే ఆ సినిమా బాలేదు, రౌడీ స్టార్ పనైపోయింది, ఇకపై విజయ్ దేవరకొండ సినిమాలు తియ్యడం వేస్ట్ అంటూ మొదలు పెట్టారు.
వారు మాట్లాడిన విధంగా అంటే అంత ఘోరంగా అయితే ఫ్యామిలీ స్టార్ లేదు. మిడిల్ క్లాస్ ఫామిలీస్ ని బేస్ చేసుకుని కథ నడిపించాడు పరశురామ్. ఫస్ట్ హాఫ్ సరదాగా అనిపించినా.. సెకండ్ హాఫ్ లో ఫన్ లేకపోవడం, లెంత్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ స్టార్ అనుకున్న అంచనాలు రీచ్ అవ్వలేకపోయింది. కానీ విజయ్ దేవరకొండ పై కొంతమంది పనిగట్టుకుని నెగెటివిటీని చూపించడం మాత్రం రౌడీ స్టార్ ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు. యాటిట్యూడ్ తగ్గించుకున్నా విజయ్ ని మాత్రం ఆ నెగిటివిటీ వదలడం లేదు. మరి విజయ్ ఏం చేస్తే ఈ నెగెటివిటి నుంచి తప్పించుకుంటాడో చూడాలి.