అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లే గ్రౌండ్‌లో ఉండగా.. మాజీ ముఖ్యమంత్రి పొలాల్లో ఉన్నారు.!. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో రేవంత్‌ను నెటిజన్లు, సామాన్యులు ఓ ఆటాడుకుంటుండగా.. భళా గులాబీ బాస్ అంటూ కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారు. నిజమైన ప్రజల మనిషి అంటే సారేనని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే సోయి లేకుండా ప్లే గ్రౌండ్‌లో దర్శనమివ్వడమేంటి..? ఆయన ముఖ్యమంత్రా.. ఇంకేమైనానా..? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
రేవంత్ ఇలా..!
హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి వేలాదిగా అభిమానులు, క్రీడాభిమానులు.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు విచ్చేశారు. సీఎం రేవంత్ కూడా మ్యాచ్ చూడానికి వెళ్లారు. సెలబ్రిటీలను కలిసి.. క్రికెటర్లతో ఫొటోలు దిగి గట్టిగానే హడావుడి చేశారు సీఎం. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాచ్‌ను తెగ ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పక్కనే కూర్చుని మ్యాచ్ చూశారు. చెన్నైపై హైదరాబాద్ గెలిచింది కాబట్టి సరిపోయింది.. లేకుంటే రేవంత్ లెగ్ మహిమ అని ఇంకా ఏ రేంజ్‌లో తిట్టిపోసేవారో నెటిజన్లు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మ్యాచ్ చూడకూడదని రూల్ ఏమైనా ఉందా అని బీఆర్ఎస్ విమర్శలకు గట్టిగానే ఇస్తోంది కాంగ్రెస్.
కేసీఆర్ ఇలా..!
రైతన్నల కష్టాలు తెలుసుకోవడానికి.. వారికి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూడటానికి పొలం బాట పట్టారు కేసీఆర్. ఇప్పటికే నల్గొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. తాజాగా కరీంనగర్ జిల్లాకు వెళ్లారు. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి.. రైతన్నల సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియా మీట్ నిర్వహించి.. రేవంత్ సర్కార్‌ను ఓ రేంజ్‌లో తిట్టిపోశారు. కేసీఆర్ ఎల్లిండు.. ఇక ఆగడు.. ఒక్క జిల్లా కాదు రైతుల కష్టం ఎక్కడుంటే అక్కడ వాలిపోతానని కాంగ్రెస్ సంగతి తేల్చి, భరతం పడతానని స్వయంగా చెప్పుకొచ్చారాయన. పనిలో పనిగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తావన కూడా తెచ్చి విమర్శలు గుప్పించారు. దీంతో కేసీఆర్‌ను ఆహా.. ఓహో అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంకొందరైతే సార్ ఓడిండు కాబట్టి ఇప్పుడు రైతులు, ప్రజలు గుర్తొచ్చిర్రు.. అదే గెలిచుంటే అబ్బే అస్సలు పట్టించుకునే వారేనా అంటూ విమర్శలూ వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయ్ కాబట్టి ప్రజల్లో తిరుగుతుర్రు.. లేకుంటే ఫామ్‌హౌస్ నుంచి బయటికొచ్చోళ్లేనా అని గులాబీ బాస్‌ను గట్టిగానే కాంగ్రేసోళ్లు అరుసుకుంటున్నారు.
జర ఇటు సూడుర్రి సారూ!
చూశారు కదా.. ఇదీ తెలంగాణలో పొలిటికల్ సీన్. రేవంత్ మ్యాచ్ చూడటం ఎంత పెద్ద తప్పుగా బీఆర్ఎస్‌కు అనిపించిందో ఏమో గానీ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అబ్బో ఆ కామెంట్స్‌కు అయితే అడ్డు అదుపు లేనే లేదు. రేపొద్దున మీడియా ముందుకు వచ్చి ఈ మొత్తం వ్యవహారంపై రేవంత్ ఎలా స్పందిస్తారో ఏంటో. ఏదేమైనా తెలంగాణలో రైతన్నలు ఇంత ఘోస పడుతుంటే రేవంత్ మాత్రం ఇంతవరకూ పొల్లెత్తి మాట కూడా మాట్లాడకపోవడంతోనే ఇంత పెద్ద చిక్కొచ్చి పడినట్లయ్యింది. కనీసం రైతుల బాధలు పట్టించుకొని ఆ నీళ్ల సంగతేంటో చూసి.. నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారం ప్రకటిస్తే పరిస్థితి ఇంతవరకూ వచ్చేదేనా..? ఈ విషయంలో ఒకటికి పదిసార్లు రేవంత్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.