ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జంపింగ్‌లు గట్టిగానే జరుగుతున్నాయి. టికెట్లు దక్కని నేతలు, ఆశావహులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. అధికార పార్టీలో ఉంటూ రెబల్‌గా మారిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.. అలా వైసీపీ అగ్రనాయకత్వంపై మొదటి రోజు నుంచీ తీవ్రస్థాయిలో పోరాటం చేసిన ఆయన ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో రఘురామ పసుపు కండువా కప్పుకున్నారు. కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా.. మనస్పూర్తిగా ఆహ్వానించారు. ఈ చేరిక సందర్భంగా అటు చంద్రబాబు.. ఇటు రఘురామ తీవ్ర స్థాయిలో జగన్‌పై విరుచుకుపడ్డారు.
ఇంత దుర్మార్గమా..?
ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన వ్యక్తి రఘురామకృష్ణ అని చంద్రబాబు కొనియాడారు. ప్రజలందరి ఆమోదంతో ఆయన్ను ఇవాళ పాలకొల్లు సభ ద్వారా పార్టీలోకి చేర్చుకుంటున్నామని అన్నారు. మనందరం ప్రజాస్వామ్యంలో ఉన్నామని.. ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని ఇది ఆమోదయోగ్యమా? ఏమిటీ అరాచక పాలన? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రఘురామను పోలీసులు అదుపులోనికి తీసుకుని ఇష్టానుసారం చిత్రహింసలు పెట్టిన విషయాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇలాంటి వ్యక్తులను కూడా కలుపుకుని పనిచేయాల్సిన అవసరం ఉందని.. అందుకే రఘురామను మనస్ఫూర్తిగా టీడీపీలో చేర్చకుంటున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యేగా పోటీ..!
నరసాపురం ఎంపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న రఘురామను చంద్రబాబు ఆదరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గమైన ఉండి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో ఈ టికెట్ విషయంపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పలుచోట్ల టికెట్ల విషయంలో తెలుగు తమ్ముళ్లు రచ్చ రచ్చజేస్తున్నారు. ఇప్పుడు ఉండి టీడీపీ అభ్యర్థిగా ఉన్న మంతెన రామరాజు.. రఘురామను తీసుకొస్తే ఏం చేయబోతున్నారు..? సామాజికవర్గ కోణంలో చూసి.. మిన్నకుండిపోతారో అధిష్టానం మాట మన్నించి ఒప్పుకుంటారో వేచి చూడాల్సిందే మరి.