టీడీపీ త్యాగం.. రఘురామకు ఎమ్మెల్యే సీటు!
అవును.. రఘురామకృష్ణం రాజుకు సీటొచ్చేసింది. అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోవడమే ఆలస్యం.. పోటీస్థానం ప్రకటన వచ్చేయనుంది. మొదట్నుంచీ టీడీపీకి సపోర్టుగా.. వైసీపీని తిట్టిపోస్తున్న రాజుకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశ.. ఇక రాజకీయాలకు దూరంగా ఉందాం అనుకునే టైమ్‌లో సైకిల్ పార్టీ అధినేత నారా చంద్రబాబు నుంచి తీపి కబురొచ్చింది. ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ విచ్చేసిన రఘురామ.. నేరుగా చంద్రబాబు ఇంటికెళ్లారు. సుమారు అరగంటకుపైగా కూటమి పరిస్థితి, తన సీటు గురించి నిశితంగా చర్చించారు. ఫైనల్‌గా ఇక బీజేపీ, జనసేన పార్టీలను పక్కనెట్టి.. టీడీపీలో చేర్చుకుని.. ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని బాబు ఫిక్సయిపోయారు.
పోటీ ఎక్కడ్నుంచి..?
నరసాపురం టికెట్ విషయంపై మరోసారి ఆలోచించాలని చంద్రబాబును రఘురామ కోరగా.. అది గతం ఇక వదిలేయండని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ధైర్యం చెప్పారట. తాను చేయాల్సిన ప్రయత్నం చేశానని.. నేరుగా నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మతో కూడా టచ్‌లోకి వెళ్లి పోటీ విరమించుకోవాలని కోరినప్పటికీ వర్కవుట్ కాలేదట. దీంతో ఇక మరో మార్గం లేకనే ఎమ్మెల్యేగా పోటీలోకి దింపుతున్నట్లు రఘురామకు నచ్చజెప్పారట. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గమైన ఉండి నుంచి పోటీ చేయించాలని బాబు నిర్ణయానికొచ్చేశారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకొని.. ఆ మరుక్షణమే పోటీ స్థానంపై ప్రకటన ఉండనుందట. కూటమి గెలిస్తే రఘురామకే అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వాలని.. అప్పుడే వైఎస్ జగన్‌ను ఓ ఆటాడుకోవడానికి మంచి ఛాన్స్ ఉంటుందని టీడీపీ భావిస్తోందట.
మంతెన సంగతేంటి..?
వాస్తవానికి పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి.. కీలక అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలు ఇచ్చి టీడీపీ నానా తంటాలు పడుతోంది. దీంతో చాలా మంది టికెట్ ఆశించిన వారు రెబల్స్‌గా మారడం, పార్టీలు మారడం.. రచ్చ రచ్చ రేపారు. దీంతో నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగి బుజ్జగించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఇదే ఖాతాలోకి ఉండి నియోజకవర్గం కూడా వెళ్లనుంది. ఎందుకంటే.. ఇప్పటికే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రఘురామకు టికెట్ అంటూ ఉండటంతో రాజుగారి కోసం మరో రాజు సీటు వదులుకోవాల్సి వస్తోందన్న మాట. మరి ఈ త్యాగం చేయడానికి మంతెన సిద్ధంగా ఉన్నారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.