తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అట్లర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకుందామని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో గులాబీ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలు, వరుస షాక్‌లే తగులుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. కీలక నేతలు ఒక్కొక్కరుగా జంప్ అయిపోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కారు దిగి వెళ్లిపోతుండటం గమనార్హం. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కావ్యను హైకమాండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే బీఆర్ఎస్ అవినీతి, కుంభకోణాలు ఆమెకు తెలిసిరావడం.. రాజీనామా చేయడం కాంగ్రెస్ కండువా కప్పేసుకోవడం కూడా అయిపోయింది. ఇక అసలు విషయానికొస్తే.. ఒక్క శనివారం నాడే భారీగా చేరికలు జరిగాయి. ఈ నేతలంతా బీఆర్ఎస్ హయాంలో ఓ ఊపు ఊపిన వారే.
ఒక్కరోజే ఎన్ని దెబ్బలో!
కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్‌లో చేరిపోయారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు శ్రీహరిని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే.. బీఆర్ఎస్‌లో ఇచ్చిన ఎంపీ సీటును కుమార్తెకు ఇస్తే తాను పార్టీలోకి వస్తాననే షరతుతో హస్తం గూటికి చేరారనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థి లెక్క తేలిపోనుంది. ఇక.. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఆమె తండ్రి, సీనియర్ నేత కేశవరావు మాత్రం ఇవాళ సాయంత్రం పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా హస్తం గూటికి చేరిపోయారు. ఈయన ఉద్యమ సమయం నుంచీ కేసీఆర్‌తోనే ఉన్న వ్యక్తి.. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆగమైందని తీవ్ర అసంతృప్తితో బయటికొచ్చి కాంగ్రెస్‌లో చేరారు.
మరోవైపు ఇలా..!
ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ.. గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఈ చేరిక జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న-కోటి కాంగ్రెస్‌లో చేరారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కారు దిగిపోయే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కేశవరావుతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు.. నందమూరి సుహాసిని సీఎం రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చూశారుగా.. ఒకే రోజు బీఆర్ఎస్‌కు ఎన్ని మాస్టర్ స్ట్రోకులు తగిలాయో.. ఎన్నికల ముందే ఇలాగుంటే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని కారు పార్టీలో కంగారు మొదలైందని చెప్పుకోవచ్చు.