తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంచలన, ఊహకందని నిర్ణయాలు.. అంతకుమించి వివాదాస్పద నిర్ణయాలు సైతం తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి, దళితబంధును పూర్తిగా ఎత్తేసిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా జాతీయ మీడియాలో కోడై కూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి మరోసారి జిల్లాల పునర్విభజన అంశాన్ని తెచ్చింది. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలను ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ప్రముఖ ఆంగ్ల, జాతీయ పత్రికలో ఈ వార్త రావడంతో తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ వార్తతో తెలంగాణ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. కొత్త జిల్లాలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సమయంలో ఈ వార్తతో తెలంగాణ అంతటా ప్రజల్లో ఆందోళన, అయోమయం మొదలైంది.
అసలేం జరుగుతోంది..?
కాంగ్రెస్ అనుకున్నట్లుగా.. ఈ నిర్ణయం అమలైతే మాత్రం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుగా రద్దు కానున్నాయి. ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని కాస్త నిశితంగా పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒకరు.. 33 జిల్లాలను కుదించి 17 లోక్‌సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు.. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం అస్సలు ఇన్ని జిల్లాలు ఎందుకు..? వీటి వల్ల ఒరిగేదేంటి..? కచ్చితంగా 33 జిల్లాల్లో కొన్ని రద్దు చేస్తామని కూడా ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. రేవంత్ ఇంటర్వ్యూలో ఇలా చెప్పడం.. ఇప్పుడిలా కీలక నేత మాట్లాడటం వెనుక కచ్చితంగా ఏదో జరుగుతోందని రాష్ట్ర ప్రజలు అయితే ఒకింత ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలు రద్దయితే..?
కొత్త జిల్లాల పునర్విభజన చేస్తే జరిగే పరిణామాలు చాలానే ఉన్నాయని తెలంగాణ మేథావులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజా సంఘాలు చెబుతున్నాయి. మొదట.. ఏ జిల్లాలు రద్ద్దు అవుతాయో.. ఆయా జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు పడిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రియల్ ఎస్టేట్ కూడా ఢమాల్ అనే పరిస్థితులు మెండుగా ఉన్నాయి. ఇక జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దవుతాయని మేథావులు చెబుతున్నారు. అంతేకాదు.. మళ్ళీ భారీ బదిలీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అస్తవ్యస్తం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు.. ఉన్న మ్యాపులన్నింటినీ తిరగరాయాల్సి ఉంటుంది. ఇక.. పోటీ పరీక్షల సిలబస్ మార్చాల్సి ఉంటుంది. అదేవిధంగా.. జోనల్ విధానం మార్చాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్న మాట. మరీ ముఖ్యంగా.. రెండేళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు.. దీంతో అసలే తెలంగాణలో ఉద్యోగాలు లేక విలవిల్లాడుతున్న నిరుద్యోగులు.. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితి. మరోవైపు.. ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు ఇతర జిల్లా కేంద్ర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగంగా మారిపోతాయి.
అవసరమంటారా..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ జిల్లాల రద్దు ప్రక్రియ అనేది.. పార్లమెంట్ ఎన్నికల ముందే తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంటే మాత్రం కాంగ్రెస్‌కు వచ్చిన మంచి రోజులు పోయి.. మళ్లీ పాతరోజులు వస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు దక్కించుకోవాలని.. వ్యూహ రచన చేస్తున్న కాంగ్రెస్‌కు కచ్చితంగా రాష్ట్ర ప్రజలు బిగ్ షాక్ ఇస్తారనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని పరిశీలకులు, మేథావులు చెబుతున్నారు. సో.. దీన్ని బట్టి చూస్తే.. 100 రోజుల పాలనను సవ్యంగా, ప్రశాంతంగా ముగించుకున్న రేవంత్ రెడ్డి అనవసరంగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని మాత్రం క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవచ్చు. అసలు ఇలా జిల్లాల పునర్విభజన చేస్తే నష్టాలేంటి..? ప్రభుత్వానికి వచ్చే మైనస్‌లు ఏంటి..? అనేది ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్, నాగేశ్వరరావులతో పాటు పెద్దలను ఒకటికి పదిసార్లు అడిగి అభిప్రాయాలను రేవంత్ తెలుసుకుంటే మంచిదేమో..!