జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ త్యాగం చేయాల్సిన వచ్చిందా..? ఇప్పటికే 21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ సీట్లు తీసుకుని కూటమికి త్యాగం చేసిన సేనాని.. ఇందులోనూ మరో సీటును త్యాగం చేయాల్సిందేనా..? ఇప్పటి వరకూ టీడీపీ కోసం.. ఇక బీజేపీ కోసం త్యాగమూర్తిగా మారాల్సిందేనా..? తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. కూటమి గెలవడానికి ఇప్పటి వరకూ చాలా త్యాగాలు చేశా.. అవసరమైతే మరిన్ని చేయడానికి కూడా వెనుకాడను.. అవమానాలు కూడా పడ్డాను.. అని స్వయంగా చెప్పిన సేనానికి ఇప్పుడు త్యాగం చేయాల్సిన సమయం ఆసన్నమైందనే చెప్పవచ్చు. ఇంతకీ ఆ త్యాగమేంటి..? అసలు ఈ టైమ్‌లో సేనానీయే ఎందుకు త్యాగం చేయాలి..? టీడీపీ ఎందుకు సిద్ధంగా లేదు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం రండి..
ఇదీ అసలు కథ..!
ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో కూటమిలో భాగంగా టీడీపీ-144, జనసేన-21, బీజేపీ-10 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నాయి. ఇక పార్లమెంట్ స్థానాల విషయానికొస్తే.. మొత్తం 25 సీట్లలో టీడీపీ-17, బీజేపీ-06, జనసేన-02 స్థానాలను పంచుకోవడం జరిగింది. నాలుగైదు మినహా టీడీపీ దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. జనసేన సైతం 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక బీజేపీ మాత్రం ఇంతవరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో క్యాడర్‌లో తీవ్ర అసహనం అసంతృప్తి ఏర్పడింది. అయితే.. టీడీపీ ఇచ్చిన 10 సీట్లు సరిపోవట్లేదని.. అసలు సీట్లు ఎవరికివ్వాలో.. ఎవరికి ఇవ్వొద్దో కూడా తెలియని పరిస్థితట. దీంతో మరో సీటు ఇవ్వాల్సిందేనని బీజేపీ పట్టుబట్టి కూర్చుంది. అంటే.. 11 సీట్లు కావాలన్నది బీజేపీ టార్గెట్ అన్న మాట. మంగళవారం నాడు ముఖ్యనేతలు, ఎంపీ అభ్యర్థుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో అటు టీడీపీని.. ఇటు జనసేనను ముఖ్యనేతలు సంప్రదించగా పవన్ కల్యాణ్‌ను అడిగి తీసుకోవాలని చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం.
పవన్ ఎందుకివ్వాలి..?
18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్.. ఇంకా మూడు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. ఈ మూడు స్థానాలకు తీవ్ర పోటీ ఉండటంతో పక్కనెట్టారు. దీంతో ఈ మూడు స్థానాల్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ను బీజేపీ తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పాలకొండ, అవనిగడ్డ, విశాఖ సౌత్‌లో ఏదో ఒక నియోజకవర్గాన్ని బీజేపీ కోరే ఛాన్స్ ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విశాఖ సౌత్‌ను కమలనాథులు కోరే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. అయితే జనసేన సీటు కోల్పోయినా ఆ ఒక్క సీటు నష్టం మాత్రం టీడీపీకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పి. గన్నవరం సీటును టీడీపీ తన అభ్యర్థిగా మహాసేన రాజేష్‌కు కేటాయించడం.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జనసేనకు ఇవ్వడం.. తమ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను ప్రకటించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే జనసేనకు సీటిచ్చిన తర్వాత టీడీపీ మాత్రం మరొకటి తీసుకోలేదు. దీంతో.. ఇప్పుడు కాషాయ పార్టీ అడుగుతుండటంతో ఆ సీటును అటు సర్దాలని చంద్రబాబు నుంచి పవన్‌కు సందేశం వెళ్లిందట. చూశారుగా.. కూటమిలో పరిస్థితి ఎలా ఉందో.. పవన్ ఇలా త్యాగం చేసుకుంటూ పోతే.. ఆఖరికి ఏం మిగులుతాయో.. ఏంటో మరి.