జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సొంత పార్టీ నేతలు కొందరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి. సేనానీ పైకి చెప్పే మాటలకు లోలోపల జరిగే వాటికి అస్సలు సంబంధమే ఉండదన్నది గత నాలుగైదు రోజులుగా స్పష్టంగా అర్థమవుతోందని నేతలు చెబుతున్న మాటలు. కులం ముఖ్యం కాదని పదే పదే చెప్పిన పవన్.. సీట్లు ఎవరెవరికి ఇచ్చారో..? ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. జనసేన దక్కించుకున్న 21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ స్థానాల్లో సామాజిక కోణంలో చూస్తే.. ఎవరికి ఎన్ని టికెట్లు ఇచ్చిందనే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసిన నేతలను పక్కనెట్టి వలస నేతలకు టికెట్లు ఇవ్వడం పవన్ చేసిన పెద్ద తప్పుగా.. పార్టీలోని కొందరు సీనియర్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఇలా పార్టీ అన్యాయం చేసిందని ఆరోపిస్తున్న వారిలో ఒకరు పోతిన మహేశ్. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ గళం వినిపించడంలో ముందుండే నేత ఈయనే. ఇలాంటి వ్యక్తికే టికెట్ ఇవ్వలేదు పవన్. దీంతో కూటమి ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకూ రచ్చ రచ్చే నడుస్తోంది.
ఇవ్వాల్సిందే..!
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోక పోయినా పోతిన మహేశ్.. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అధికార పక్షం వైసీపీపై.. విజయవాడలోని మంత్రుల బాగోతాలను బయటపెట్టిన వ్యక్తి. మీడియా ముందుకొచ్చినా, టీవీ డిబెట్స్ పెట్టినా.. ఇంటర్వ్యూల్లో అయినా చాలా స్పష్టంగా, విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతుంటారు. పైగా ఎమ్మెల్యే అభ్యర్థికి సరైనోడే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తనకంటూ మంచి పేరు, క్యాడర్ దక్కించుకున్న నేత. జీరో నుంచి ఇక్కడ పార్టీని అభ్యర్థి ఉన్నారు.. పోతిన లాంటివారికి టికెట్ ఇస్తే గెలుస్తారనే పరిస్థితికి తెచ్చుకున్నారు. క్యాడర్ ఓటేయడానికి రెడీగా ఉన్నా.. పవన్ మాత్రం టికెట్ ఇవ్వడానికి ఏ మాత్రం సుముఖంగా లేరు. ఎందుకో తెలియట్లేదు కానీ.. ఇలాంటి వారిని వదులుకుని పవన్ పెద్ద తప్పే చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.
పాపం పోతినా..!
వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తుండటం.. కొన్ని నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇందుకు కారణం.. మూడు పార్టీలకు చెందిన బలమైన నేతలు ఆ నియోజకవర్గాల్లో ఉండటమే. దీంతో ఆ నేతలంతా టికెట్ ఇస్తే సరే.. లేకుంటే పార్టీ మారడానికి కూడా సిద్ధమైపోతున్నారు. ఇలా టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్న వ్యక్తే పోతిన మహేశ్. తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని ఈయన చేయని పనంటూ లేదు.. దేవుడికి మొక్కులు మొదలుకుని దీక్ష వరకూ చేపట్టారు. దీంతో విజయవాడ వెస్ట్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. తనకు టికెట్ ఇస్తేనే న్యాయమని.. ఐదేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని మొరపెట్టుకున్నారు. నియోజకవర్గంలో ప్రతి అణువూ తనకు తెలుసని.. అభిమానులు, కేడర్ ఎంతో కష్టపడుతోందని.. ఎట్టిపరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని కూడా చెబుతున్నారు. అంతేకాదు.. స్థానికంగా వ్యతిరేకత ఉండటంతో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను విజయవాడ సెంట్రల్‌కు వైసీపీ హైకమాండ్ పంపారన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. అన్నీ చెబుతూనే పవన్ న్యాయ చేస్తారనే నమ్మకం ఉందని కూడా చెప్పారు. చూశారుగా.. ఇలాంటి నేతను పోగొట్టుకుంటే ఇక చేసేదేమీ లేదు మరి. ఇప్పటికైనా మహేశ్‌ను పవన్ పట్టించుకుంటే మంచిది మరి.