ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారైనా సత్తా ఏంటో చూపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. కూటమి గట్టడం.. ఎన్డీఏలో చేరికకు సేనాని ప్రధాన పాత్ర పోషించారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలను తెచ్చుకున్నారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ.. టికెట్ల ఇవ్వడంలో పవన్ అచ్చు తప్పులు చేశాడన్నది సొంత పార్టీలో నడుస్తున్న చర్చ. దీంతో రోజుకో వికెట్ చొప్పున జనసైన్యం నుంచి పడిపోతున్నది.
అసలేం జరిగింది..?
పవన్ తీసుకున్న మొత్తం 21 సీట్లలో ఇప్పటివరకు 18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇందులో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నాలుగు సీట్లు పోగా.. మిగిలిన 14 జనరల్ సీట్లలో 10 సీట్లు కాపులకు ఇవ్వడం గమనార్హం. ఇందులో 12 స్థానాలు ఓసీలకు, రెండు సీట్లలో బీసీ అభ్యర్థులకు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇక మహిళల కోటలోనూ ఒక్కరంటే ఒక్కరికే అవకాశం దక్కింది. దీంతో చాలా సామాజిక వర్గాలకు సీట్లు దక్కలేదు. మైనార్టీలు గురించి ఓ రేంజ్‌లో ఊదరగొట్టే పవన్.. వారికి ఒక్కటంటే ఒక్కటీ సీటు ఇవ్వకపోవడంపై ఈ వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. దీంతో జనసేన అనేది రాజకీయ పార్టీనా.. లేక కుల పార్టీనా..? అనే చర్చ ఏపీ రాజకీయాల్లో, యువతలో మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే జనసేనలో కులాల కుంపటి రాజుకున్నదని చెప్పుకోవచ్చు. పవన్ చర్యలతో సొంత పార్టీ నేతలో ఒకింత అసంతృప్తికి లోనవుతున్న పరిస్థితి.
ఇప్పుడైనా ఉంటుందా లేదా..?
ఇప్పటి వరకూ 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఇక మూడు స్థానాలకు మాత్రమే ఖరారు చేయాల్సి ఉంది. దీంతో ఈ మూడు సీట్లలో అయినా సామాజిక న్యాయం చేస్తారా అనే దానిపై జనసేనలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవకాశం దక్కని ఆశావహులు ఈ ముగ్గురిలో తమ పేరు కచ్చితంగా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా.. పార్టీ ఆవిర్భావం నుంచి బలోపేతం కోసం కృషి చేసిన నేతలను, క్రియాశీల నాయకులను కాదని.. వలస నేతలను ప్రాధాన్యత ఇవ్వడంతో క్యాడర్‌లో అసంతృప్తి రగిలిపోతోంది. ఇది అధికార వైసీపీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని.. పవన్‌ను విమర్శించడానికి చేజేతులారా లక్కీ ఛాన్స్ ఇచ్చారనే గుసగుసలు జనసేనలోని ఓ వర్గం నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఎలా డిఫెండ్ చేసుకుంటారు..? అనేది తెలియాల్సి ఉంది.