అవును.. అంతా అనుకున్నట్లే జరిగింది.. రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (RRR)కు కూటమి హ్యాండిచేస్సింది. కూటమి కట్టడంలో.. కూటమి కోసం తనవంతుగా మీడియాలో మాట్లాడుతూ సొంత పార్టీ వైసీపీకే చుక్కలు చూపిస్తూ వచ్చిన ఆయనకే.. ఇప్పుడు కనిపించిన పరిస్థితి. బీజేపీలో చేరి కచ్చితంగా పోటీచేస్తానన్న రాజు ఆశలు అడియాసలయ్యాయి. ఏ పార్టీలు అయితే ఈయన్ను ఎంకరేజ్ చేశాయో.. అవే పార్టీలు ఇప్పుడు వద్దనుకుని వదిలేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏ రేంజ్‌లో ప్రోత్సహించారో.. ఎప్పుడెలా ఆకాశానికెత్తారా ప్రత్యేకించి చెప్పట్లేదు. ఒకట్రెండు ప్రధాన మీడియా సంస్థలు ఈయన మీడియా ముందుకు వస్తే చాలు.. అదేపనిగా కవరేజ్ ఇచ్చుకుంటూ వచ్చేవి. ఇప్పుడు ఆయన్ను ఏ మీడియా సంస్థ.. ఏ పార్టీ అధినేత కూడా కాపాడి.. సింగిల్ సీటును ఇప్పించలేకపోవడం గమనార్హం.
అరెరే.. ఇలా జరిగిందేంటి..?
కూటమిలో భాగంగా బీజేపీ తన ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. రాజమండ్రి- పురంధేశ్వరి, అనకాపల్లి- సీఎం రమేష్, అరకు- కొత్తపల్లి గీత, రాజంపేట- కిరణ్‌కుమార్‌రెడ్డి, తిరుపతి- వరప్రసాద్, నరసాపురం- శ్రీనివాసవర్మ లను అభ్యర్థులుగా ప్రకటిస్తూ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది బీజేపీ. చూశారుగా అభ్యర్థులు ఎవరు ఎవరి మనుషులు అనేది. మొదట్నుంచీ రమేష్‌కు పక్కాగా అనకాపల్లి ఇస్తారని.. చంద్రబాబు చక్రం తిప్పారనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. ఇక వరప్రసాద్ విషయానికొస్తే.. వైసీపీని వీడి కాషాయ కండువా కప్పుకున్న రోజే అభ్యర్థిగా ప్రకటించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇక శ్రీనివాసవర్మ అనే వ్యక్తి ఎవరో.. రాష్ట్రానికి అయితే తెలియదు.. నియోజకవర్గానికి అయినా తెలుసో లేదో మరి. మొదట్నుంచీ ఈ టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రఘురామకు ఆఖరి నిమిషంలో ఇలా కంగుతినేలా చేసింది కాషాయ పార్టీ. అధికార పార్టీనే కాదని.. గెలిపించిన నియోజకవర్గాన్ని నిలువునా వదిలేసిన రఘురామకు ఇలా జరగడంలో ఎలాంటి తప్పులేదన్నట్లుగా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయ్.
ఉన్నదీ పాయె..!
వాస్తవానికి రఘురామకు నరసాపురంతో పాటు రాష్ట్రంలో జనాలకు తెలిసిన మనిషి. పైగా రోజూ మీడియాలో కనిపిస్తుండటం.. పదే పదే సీఎం జగన్, వైసీపీని ఏకిపారేస్తుండటంతో నలుగురికి తెలిశారు కూడా. సొంత పార్టీ తప్పులు చేస్తున్నదని ఎదిరించి.. సీఎం వర్సెస్ ఎంపీగా మారిపోయారు. మీడియా ముందుకొచ్చినా, డిబెట్స్ చేసినా.. ఇంటర్వ్యూల్లో అయినా ఈయన కనపడితే చాలు అబ్బో.. ఆ కథే వేరుగా ఉండేది. సీన్ కట్ చేస్తే.. ఉన్న వైసీపీకి చెడ్డ అయ్యి.. లేనిపోని కూటమి కోసం అహర్నిశలు కష్టపడి ఆఖరికి టికెట్ లేకుండా చేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. సింపుల్‌గా చెప్పాలంటే.. అదేదో అంటారే ఉన్నదీ పాయె.... అని ఊళ్లల్లో అంటుంటారు కదా.. అక్షరాలా ఇప్పుడు రఘురామ పరిస్థితి కూడా ఇదే. ఇక వైసీపీ కార్యకర్తలు, అభిమానులు.. సోషల్ మీడియాలో ఈయన్ను ఓ రేంజులో ఆటాడేసుకుంటున్నారు. అయితే.. రఘురామకు వైసీపీయే చెక్ పెట్టిందని.. ఇదంతా జగన్ పనేనని ఆర్ఆర్ఆర్ అభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి. ఏదైతేనేం నష్టపోయింది మాత్రం రాజుగారే. ఇప్పుడు ఆయన స్టెప్ ఏంటి..? అనేది తెలియాల్సి ఉంది.