తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయం సాధించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోష్‌ను కొనసాగించాలని వ్యూహ రచన చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాల్లో పాగా వేయాలని హైకమాండ్ భావిస్తోంది. ఇందుకోసం అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేసిన అధిష్టానం 9 మంది గెలుపు గుర్రాలను ప్రకటించింది. ఇక మిగిలిందల్లా 8 పార్లమెంట్ స్థానాలే. అయితే.. ఇప్పటికే ఈ స్థానాలకు అభ్యర్థుల దాదాపు ఫిక్స్ అయినప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట.
పెండింగ్‌లు ఇవే..!
ఆదిలాబాద్, ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే.. ఆదిలాబాద్ సీటుకు ఆత్రం సుగుణ పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నట్లుగా తెలియవచ్చింది. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన సుగుణ.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే.. సిట్టింగ్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు కూడా ఆ పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాజీనామా ఒక్కటే మిగిలి ఉంది. సిట్టింగును కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడంతో పార్టీలో ఉండటం ఎందుకని అనుచరులు, అభిమానుల నుంచి బాపూరావుకు వస్తున్న ప్రశ్నలు. దీంతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆదిలాబాద్ ప్రకటన ఆలస్యమైందనే చర్చ కూడా జరుగుతోంది.
ఇక్కడా కొట్లాటే!
ఇక ఖమ్మం, భువనగిరి పార్లమెంట్ స్థానాల విషయానికొస్తే పెద్ద పంచాయితీనే నడుస్తోంది. ఖమ్మంలో తమ వారికి సీటు ఇప్పించుకునేందుకు సీనియర్ నేతలు విశ్వ ప్రయత్నాలుచేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మధ్య గట్టి పోటీనే నెలకొంది. అయితే ఈ ఇద్దర్నీ కాదని మరొకరికి టికెట్ ఇవ్వాలనే ప్లాన్ కూడా అధిష్టానానికి ఉంది. ఖమ్మంలో సామాజిక సమీకరణాల దృష్యా కమ్మ వర్గానికి ఇస్తే బాగుంటుందన్నది హైకమాండ్ ఆలోచనట. అలాగైతే.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడికి దక్కే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. అయితే తన సోదరుడికి ఇవ్వాల్సిందేనని పొంగులేటి పట్టుబడుతున్నారట. భునగిరి విషయానికొస్తే.. కోమటిరెడ్డి బ్రదర్స్, సీఎం రేవంత్ సన్నిహితుల మధ్య గట్టి పోటీ నెలకొంది. చామల కిరణ్ కోసం రేవంత్ పట్టుబడుతున్నారు. ఈ ముగ్గురి మధ్యలోకి ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఎంట్రీ ఇచ్చిన గుత్తా అమిత్, పైళ్ల శేఖర్‌రెడ్డి ఏఐసీసీ స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరి ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రత్యర్థి పార్టీలు బీసీకే టికెట్ ఇవ్వడంతో.. కాంగ్రెస్ కూడా బీసీకే ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చూస్తే.. మిగిలినవన్నీ దాదాపు ఫైనల్ అయినప్పటికీ ఈ రెండే కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూస్తే.. అటు భట్టీ వర్సెస్ పొంగులేటి.. ఇటు రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డిల మధ్య ఎంపీ సీట్ల ఫైట్ గట్టిగానే జరుగుతోంది.. ఫైనల్‌గా ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.