వైసీపీని వీడి ఏ నిమిషాన ఆరణి శ్రీనివాసులు జనసేనలోకి అడుగుపెట్టారో చిత్తూరు జిల్లాలో ఒకటే రచ్చ. సొంత నియోజకవర్గంలోనూ రచ్చే.. పోటీ చేయాలనుకున్న తిరుపతిలో అయితే అంతకుమించి రచ్చ. మరోవైపు.. టీడీపీ ఇవ్వాల్సిందేనని తెలుగు తమ్ముళ్లు, బీజేపీ ఇచ్చి తీరాల్సిందేనని కమలనాథులు గట్టిగానే పట్టుబడుతున్నారు. దీనికి తోడు లోకల్ సెంటిమెంట్ ఎక్కువయ్యింది. స్థానికులకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఎక్కువవడంతో దాదాపు ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలున్న ఆరణి ఔట్ అయ్యారు. దీంతో స్థానికంగా ఉన్న ఎవర్ని బరిలోకి దింపితే బాగుంటుంది..? ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి ఎవరిది..? తిరుపతి ఎవర్ని కోరుకుంటోంది అని జనసేన సర్వే చేయడం మొదలుపెట్టింది. స్థానిక నేతలతో సమావేశం తర్వాత తప్పకుండా ఫీల్డ్ సర్వే చేస్తామని కీలక నేత నాగబాబు కూడా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో రెండు మూడ్రోజుల్లో సర్వే రిపోర్టు రానుంది.
ఆరణి ఔటే.. నో డౌట్!
ప్రజారాజ్యం మొదలుకుని ఇప్పటి జనసేన వరకూ మెగాభిమానులు, క్యాడర్ తిరుపతిలో గట్టిగానే ఉంది. సొంత ఇలాకాలో చిరంజీవి ఓడినా.. తిరుపతిలో గెలిచారంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఇక్కడ ఎలాగైనా సరే గెలిచి నిలవాలన్నది అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్. ఆరణిని ప్రకటించేద్దాం.. మీరెళ్లి గ్రౌండ్ వర్క్ చేసుకోండని చెప్పినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. అయితే.. లోకల్ సెంటిమెంట్‌తో రచ్చ రేగుతోంది. దీంతో స్థానికులనే బరిలోకి దింపితే బాగుంటుందని పవన్ భావిస్తున్నారు. అయితే.. కూటమిలో భాగంగా వచ్చిన టికెట్ గనుక.. అటు టీడీపీ.. ఇటు బీజేపీ నేతలు, క్యాడర్‌ను దృష్టిలో పెట్టుకుని స్థానికులకే ఇస్తే సమరంలో గెలవచ్చని జనసైన్యం ప్లాన్ చేస్తోంది. దీనికితోడు లోకల్‌గా ఉన్నవారికే టికెట్ ఇస్తేనే సహకరిస్తామని టీడీపీ, బీజేపీ నేతలు సైతం ఒకింత అల్టిమేటం కూడా జారీ చేసింది.
మార్పు మంచిదే..!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఒకట్రెండు రోజుల్లో టీడీపీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. స్థానికంగా మంచి పలుకుబడి, పొలిటికల్ బ్యాగ్రౌండ్.. రాజకీయ అనుభవం ఇవన్నీ కలిసొచ్చే అంశాలు. పైగా టీడీపీ క్యాడర్ కూడా ఆమెతో నడవడానికి సిద్ధంగానే ఉంది. దీనికి జనసేన తోడైతే ఈజీగా గెలవచ్చన్నది సుగుణమ్మ ప్లానట. మరోవైపు.. టికెట్ కోసం అవసరమైతే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే ప్రకటించారు కూడా. మరోవైపు.. బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి సైతం టికెట్ కోసం ఢిల్లీ నుంచి గట్టిగానే ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. ఫైనల్‌గా ఎవరికి టికెట్ దక్కుతుందో..? ఈ గొడవలతో జనసేన టికెట్ చేజార్చుకుంటుందో..? అన్నీ సెట్ రైట్ చేసి జనసైనికుడినే బరిలోకి దింపుతుందో చూడాలి మరి.