దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టంచిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పట్లో వదిలే అవకాశాలు అయితే అస్సలు కనిపించట్లేదు. అరెస్ట్ అనంతరం ఏడ్రోజులపాటు కస్టడీకి తీసుకున్న ఈడీ.. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే విచారణ చేయాల్సింది ఇంకా చాలా ఉందని.. కవిత విచారణకు సహకరించట్లేదని మరో ఐదురోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. కోర్టు మాత్రం మూడ్రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో మరో మూడ్రోజులపాటు ఈడీ కస్టడీలోనే కవిత ఉండనున్నారు. అయితే.. కోర్టుకు వస్తున్న క్రమంలో కవిత మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పోరాడుతా!
ఢిల్లీ లిక్కర్ కేసులో తాను నిందుతురాలిని కాదని.. బాధితురాలిని అని కవిత చెప్పుకొచ్చారు. ఇది రాజకీయ అరెస్టు, కక్షపూరిత చర్య అని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయ పోరాటం చేస్తానని కవిత చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో రాజకీయ అరెస్టులు చేయడం తప్పన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ అరెస్టుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కవిత కోరారు. ఏడాది కిందట అడిగిన విషయాలనే మళ్లీ మళ్లీ అడిగారన్నారు. అంతటితో ఆగని కవిత.. జై తెలంగాణ అంటూ నినదించారు.
అంతకుముందు.. తాను తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నట్లు పీఎంఎల్ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు కంట్రోల్ కావట్లేదని.. వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికలను ఈడీ ఇవ్వట్లేదని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. అటు ఈడీ.. ఇటు కవిత ఒకరిపై ఒకరు అస్సలు తగ్గట్లేదు. కవిత కస్టడీ అటు ముగిసిందో లేదో.. ఇటు హైదరాబాద్ వేదికగా కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దీంతో కవిత వ్యవహారానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు అవకాశాలే లేకుండా పోయాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.