ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీని ఈడీ అదుపులోనికి తీసుకుంది. ఈ అరెస్టుతో సీఎం నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆప్ కార్యకర్తలు, నేతలు ఆందోనకు దిగారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి వద్ద 144 సెక్షన్ విధించి, ఆందోళనకారులను అదుపులోనికి తీసుకుంటున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. ఇక ఈడీ నోటీసులు ఇవ్వడం, ఆయన విచారణకు రానని చెప్పడం.. ఇదంతా పెద్ద కథే జరిగింది. ఆఖరికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో ఎట్టకేలకు విచారణకు వెళ్లాల్సి వచ్చింది. సీఎంను అరెస్ట్ చేస్తారని.. ఇబ్బందులు తప్పవని మొదట్నుంచీ కేజ్రీవాల్ మొదలుకుని ఆ పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీలు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ముందు కచ్చితంగా కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతుందన్న ఆరోపణలు ఎప్పట్నుంచో వస్తూనే ఉన్నాయి. ముందుగా అనుకున్నట్లుగానే అంతా జరిగిపోయింది.
ఇప్పటికే ఇలా..!
ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఈ కేసులో అరెస్టయ్యి జైలులో ఉండగా.. మరికొందరు అప్రూవర్లుగా మారి జైలు బయట ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడంతో పెద్ద రచ్చే జరుగుతోంది. అయితే.. అరెస్ట్ చేసినా సరే రాజీనామా చేయరని.. సీఎంగా కొనసాగుతారని అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసి ఇప్పటి వరకూ ఆధారాలు గుర్తించలేదన్న విషయాలను స్పీకర్ గుర్తు చేశారు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ గొంతు నొక్కేందుకే ఈ అరెస్టులు, బెదిరింపులు అని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు.. త్వరలోనే మరికొన్ని అరెస్టులు జరుగుతాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఏం జరుగుతుంందో వేచి చూడాల్సిందే మరి.