తమిళిసై రాజీనామా..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను రాష్ట్రపతికి పంపడం, ఆమోదం కూడా లభించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఆమె ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయంపై ఇప్పుడు అంతా ఆరాతీస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తమిళిసై తిరిగి ప్రత్యక్ష ఎన్నికల్లో రావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె.. తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్తున్నారు. మునుపటితో పోలిస్తే తమిళనాడులో పార్టీ కాస్తో.. కూస్తో బలపడిందనే చెప్పుకోవాలి. అన్నామలై ఆధ్వర్యంలో తమిళనాట అధికారంలోకి రావడమే లక్ష్యమే వ్యూహ రచన చాలా రోజులుగా పక్కా ప్లాన్‌తో వెళ్తోంది కాషాయ దళం. అన్నాడీఎంకే హవా తగ్గిపోవడం, ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్డీఏ కూటమిలో చేరడానికి సిద్ధంగానే ఉన్నాయి. దీంతో డీఎంకేను అధికారంలోకి రానివ్వకూడదని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనన్నది టార్గెట్. అందుకే ఇప్పుడు తమిళిసై సేవలను కూడా వాడుకుంటోంది బీజేపీ.
మేడమ్ ఏం చేయబోతున్నారు..?
రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకూడి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలియవచ్చింది. కాగా.. తమిళిసైకు పెద్ద ట్రాక్ రికార్డే ఉంది. 2019లో తెలంగాణకు తొలి మహిళా గవర్నర్‌గా వచ్చారు. వచ్చీ రాగానే.. ప్రజాదర్బార్, రాజ్‌భవన్‌లో ఫిర్యాదుల బాక్స్ పెట్టిన తొలి గవర్నర్ ఈమే. ఇక ప్రభుత్వం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా.. బిల్లులు చేసినా అస్సలు సహించేవారు కాదు. అలా కేసీఆర్ సర్కార్‌కు బద్ధ శత్రువుగా మారారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటూ ఉండేవి. ఇప్పుడు రాష్ట్రం వదిలి మేడమ్ వెళ్తుంటే కాస్త హ్యాపీగానే గులాబీ నేతలు ఫీలవుతున్నారట. ఇక కాంగ్రెస్‌లో మాత్రం ఆందోళన మొదలైందనే తెలుస్తోంది.
రేవంత్‌కు నష్టమేనా..?
కేసీఆర్ సర్కార్‌కు తమిళిసైకు అస్సలు పడేది కాదు. పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉండేవి. రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్‌గా ఎన్ని సార్లు పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రభుత్వం చేసి పంపిన ఏ ఒక్క బిల్లుకూ ఆఖరికి బీఆర్ఎస్ ఓటమిలో కూడా గవర్నర్ పాత్ర ఉందన్నది జగమెరిగిన సత్యమే. అలా కేసీఆర్‌కు చుక్కలు చూపించిన మేడమ్.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చారు. పొరపచ్చాలు ఏమీ లేకుండా చాలా అంటే చాలా సాఫీగా సర్కార్ నడిచింది. అయితే సడన్‌గా తమిళిసై రాజీనామా చేయడంతో సీఎం రేవంత్ రెడ్డిలో టెన్షన్ మొదలైందని తెలుస్తోంది. వాస్తవానికి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో అదే పార్టీ లేకపోతే.. గవర్నర్ వ్యవస్థ ద్వారా చెడుగుడు ఆడుకుంటుందన్నది అందరీ తెలిసిందే. అలా ప్రభుత్వాలు కుప్పకూలిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే వచ్చే గవర్నర్ ఎవరు..? ఎలాంటి వారు వస్తారో..? ప్రభుత్వాన్ని ఎక్కడ ఇబ్బంది పెడతారో..? అనే టెన్షన్ రేవంత్‌లో మొదలైందనే టాక్ నడుస్తోంది. తెలంగాణకు కొత్త గవర్నర్ ఎవరొస్తారో చూడాలి మరి.