అవును.. అన్న రాజ్యంలో చెల్లి అడుగెట్టబోతోంది.! ఇన్నాళ్లు అన్న-చెల్లి మధ్య పరోక్షంగా నడిచిన వార్.. ఇప్పుడు ఎన్నికల్లో తాడేపేడో అన్నట్లుగా మారబోతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిలా రెడ్డి కడప ఎంపీగా పోటీచేయబోతున్నారు. ఇప్పటికే హైకమాండ్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రాగా.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదేగానీ జరిగితే చెల్లి దెబ్బకు అన్న వైఎస్ జగన్ రెడ్డికి దబిడిదిబిడే అని ఏపీ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ టార్గెట్ ఏంటి..? అన్నపై చెల్లిని ఎందుకు ఉసిగొల్పుతోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!
సీన్ సితారేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోలాహలం మొదలైంది. అటు కూటమి.. ఇటు వైసీపీ గెలుపు వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. గెలుపోటములను మేమే నిర్ణయిస్తామని కాంగ్రెస్ కూడా బరిలోకి దిగిపోయింది. వైఎస్ షర్మిలను రంగంలోకి దింపిన కాంగ్రెస్.. మొదట వైఎస్ జగన్ రెడ్డిని ఢీ కొట్టాలని దృఢంగా ఉంది. అందుకే జగన్ కంచుకోటగా ఉన్న కడపను తొలుత ఎంచుకుంది కాంగ్రెస్. కడప ఎంపీగా షర్మిలను బరిలోకి దింపితే.. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో గట్టి ప్రభావం చూపించొచ్చని దీంతో కచ్చితంగా పార్టీకి మంచిరోజులు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఒక్క కడపే కాదు.. రాయలసీమ వ్యాప్తంగా షర్మిల ప్రభావం ఉంటుందట. ముల్లును మల్లుతోనే తీయాలంటారు కదా.. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టారో అదే వ్యక్తిని.. అదే ఫ్యామిలీ మెంబర్‌తో ఢీ కొట్టాలని భారీ వ్యూహమే రచించింది కాంగ్రెస్. ఇదేగానీ జరిగితే.. వైసీపీకి, వ్యక్తిగతంగా వైఎస్ జగన్ రెడ్డిగా గట్టి ఎదురుదెబ్బే తగులుతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో..!
అవినాశ్ అడ్రస్ ఉంటుందా..?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించింది వైసీపీ. ఈ కేసులో ఈయన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. తొలుత టికెట్ ఇవ్వకూడదని జగన్ భావించినప్పటికీ .. తర్వాత ఎందుకు ఇచ్చారో కూడా తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక షర్మిల విషయానికొస్తే.. కడప నుంచి పోటీ చేయాల్సిందేనని పదే పదే ఒత్తిడి తేవడంతో షర్మిల కాదనలేక ఒప్పుకుంటున్నట్లు తెలియవచ్చింది. వాస్తవానికి కడప జిల్లాతో వైఎస్ కుటుంబానికి ఎనలేని అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. వైఎస్ మరణాంతరం జగన్‌ను ఆదరించింది కూడా ఈ జిల్లా ప్రజలే. ఇప్పుడు అదే ప్రజలు.. తమను కూడా ఆదరిస్తారని వైఎస్ బొమ్మతో ఎన్నికలకు వెళ్లి.. అప్పట్లో వైఎస్సార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి జనాలకు చెప్పాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ ఉంది.. అన్న ముందు చెల్లి ఏ మాత్రం తట్టుకుని నిలబడుతుందనేది.. షర్మిల పోటీపై అధికారిక ప్రకటన, పోటీ చేస్తే సీన్ ఏంటో తెలుస్తుంది మరి.