రేవంత్.. సీఎం అని మరిచిపోతున్నారేంటో..!
అవును.. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అనే విషయం మరిచిపోయినట్లున్నారు!. ఇంకా ప్రతిపక్షంలోనే, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నట్లు ఫీలవుతున్నారు.! ఇప్పుడెందుకీ ప్రస్తావన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి.. రేవంత్ అనే నేను అని ప్రమాణం కూడా చేశారుగా ఇంకెందుకీ సందేహం అనే కదా మీ ప్రశ్న. జర ఆగుర్రి.. అక్కడికే వచ్చేస్తున్నా. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడానికి రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పార్టీ కోసం.. సీఎంగా తన మార్క్ చూపించడానికి చేస్తున్నారు ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కానీ వచ్చిన తలనొప్పల్లా అటు ఇటు రేవంత్ పరుగులు తీయడమే.
ఇదీ అసలు సంగతి..!
బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఎవరైనా సీటు దక్కలేదనో, లేకుంటే పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారంటే చాలు మరుక్షణమే రేవంత్.. సదరు నేత ఇంట్లో వాలిపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యనేత.. అనిపిస్తే చాలు నేరుగా సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి పయనమై వెళ్లిపోతున్నారు. వాస్తవానికి పార్టీలో చేరాలనుకునేవారు.. చేర్చుకోవాలనుకునేవారు ఒక ప్రోసీజర్ ప్రకారం అదేనండోయ్ పార్టీలో ఉండే కీలక నేతలు, ముఖ్యనేతల ద్వారా చర్చలు జరిపించడం, సఫలమైతే ఆ తర్వాత నేరుగా సీఎం క్యాంప్ ఆఫీసుకో లేకుంటే సీఎం ఇంటికో లేదా రాష్ట్ర ఇంచార్జులు సమక్షంలోనే కండువాలు కప్పుకుంటారు. కానీ రేవంత్ మాత్రం అబ్బే అదేమీ లేదు.. పార్టీలో చేరే వ్యక్తి లీడర్ అనిపిస్తే చాలు ఈయనే.. ఆ నేతకు ఇంటికెళ్లి చర్చలు జరపడం, ఆహ్వానించడం లాంటివి చేస్తున్నారు. వాస్తవానికి ఈ పద్ధతి మునుపెన్నడూ చూసి ఉండరు. కానీ రేవంత్ మాత్రం ఈ విషయంలో ఎందుకో ఇంకా పార్టీ అధ్యక్షుడిగానే, ప్రతిపక్షనేతగానే ఫీలవుతున్నారే చెప్పుకోవచ్చు. ఎందుకో ఒకటికి రెండు సార్లు ఆయన కిందున్న సలహాదారులు, ముఖ్యనేతలు ఈ విషయాన్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటే మంచిదేమో.
జరు సూడుర్రి సారూ..!
ఎందుకంటే.. ఎక్కడో ఎందుకు తెలుగు రాష్ట్రాల్లోనే చూడండి. ఇదివరకు సీఎంగా ఉన్న కేసీఆర్ అయినా.. ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ రెడ్డి అయినా.. చంద్రబాబు, పవన్‌లు అయినా ఎక్కడా ఎప్పుడూ ఏ నేత ఇంటికెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించిన దాఖలాల్లేవని చెప్పుకోవాలి. పార్టీలోని ముఖ్యనేతల ద్వారా, చేరికల కమిటీ ద్వారానో సంప్రదింపులు జరపడం.. అన్నీ ఓకే అయిన తర్వాత కండువాలు కప్పడం లాంటివి చేస్తుంటారు. రేవంత్ మాత్రం ఈ విషయాన్ని ఎందుకో పాటించట్లేదు. అందరిలాగే ఎందుకుండాలి.. నా రూటే సపరేట్ అని నడుస్తున్నారేమో కానీ ఈ పద్ధతి మాత్రం అస్సలు బాగోలేదని సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అయితే ఇదిగో ఇందుకే రేవంత్‌ను గుంపు మేస్త్రీ అనేదంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. కోమటిరెడ్డి, ఉత్తమ్, పొంగులేటి ఇంకా బడా లీడర్లు చాలా మందే ఉన్నారు.. చేరికల వ్యవహారం వాళ్లతో జరిపిస్తే తప్పేముంది..? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వంద రోజుల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రేవంత్.. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఆచితూచి అడుగులేస్తే మరింత మంచిదేమో సుమీ.!