తెలంగాణను సాధించానని చెప్పుకుంటున్న, రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఖాళీ అవుతుందో..? సారు కారుకు ఇక మనుగడలేదని నేతలంతా కాంగ్రెస్, కమలం గూటికి చేరిపోతున్నారా..? అంటే తాజా పరిణామాలు అక్షరాలా అవుననే చెబుతున్నాయి. గంటకో ఎమ్మెల్యే.. రోజుకో ఎంపీ.. రెండ్రోజులకో ముఖ్యనేత గూలాబీని వద్దని హస్తం పక్షానికి వెళ్లిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు ఎవరు గుడ్ బై చెబుతారో తెలియని పరిస్థితి. దీంతో కారుకు అన్నీ పంచర్‌లే అవుతున్నాయి. వరుస ఎదురుదెబ్బలతో పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి వచ్చింది. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటే ఇంత దారుణంగా తయారయ్యిందేంటి అని అగ్రనేతలు ఆలోచనలో పడ్డారట.
అయ్యో బాపూ..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలబెట్టుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే అవేమీ ఫలించకపోగా.. కేసీఆర్‌కు వెన్నుపోట్లు ఎక్కువయ్యాయి. ఇదిగో మేం అస్సలు పార్టీ మారం.. కారు దిగే ప్రసక్తే లేదని చెప్పిన మరుసటి రోజే జంప్ అయిపోతున్నారు. అయితే పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారంతా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. బిగ్ షాట్‌లు, ఆర్థికంగా అన్ని విధాలుగా బీఆర్ఎస్‌కు అండగా ఉన్నవారే కావడంతో దారుణాతి దారుణంగా పరిస్థితి తయారైంది. అయ్యో.. బాపూ మీకేంటి ఈ దుస్థితి అని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కారు పార్టీకి కంచుకోటలుగా ఉన్న జిల్లాలు జిల్లాలే ఒక్కొక్కటిగా చేజారిపోతున్నారు. కేడర్ మొదలుకుని నేతల వరకూ ఖాళీ చేసి వెళ్లిపోతున్నవారే. బీఆర్ఎస్‌కు హైదరాబాద్, చుట్టుపక్కలుండే రంగారెడ్డి, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలు ఆయుపట్టుగా ఉండేవి. ఒక్కో జిల్లా ఇప్పుడు ఖాళీ అవుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హవానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని ఆపరేషన్ ఆకర్ష్‌కు కాంగ్రెస్, కమలం పార్టీలు తెరలేపాయి. అయితే.. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్‌కు ఇవన్నీ కొత్తేమీ కాదు. జీరో నుంచి రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన బాస్ రేపొద్దున పార్టీ అతలాకుతం అవుతుంటే సైలెంట్‌గా ఎందుకుంటారు.
ఈ రేంజ్‌లోనా..?
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలా గెలిచిందో లేదో.. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ఎవరైతే బీఆర్ఎస్‌లో బిగ్ షాట్‌లు ఉన్నారో వారంతా ఒక్కొక్కరుగా అటు నుంచి ఇటు వచ్చేస్తున్నారు. సదరు నేతలకు ఉన్న వ్యాపారాలు, ఎడ్యుకేషన్ సంస్థలను కాపాడుకోవడానికి అన్నది జగమెరిగిన సత్యమే. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు.. కార్పొరేటర్లకే భూములు, పెద్ద పెద్ద బిజినెస్‌లు, దందాలు ఉంటున్నాయి. ఇక ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వ్యక్తులకు ఇక ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పక్కర్లేదు. పైగా.. ప్రభుత్వం ఫోకస్ చేస్తే.. కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు ఓ చూపు చూస్తే అవన్నీ ఏమవుతాయో ఆ లీడర్లకు బాగా తెలుసు. దీనికి తోడు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడంతో గులాబీ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. అందుకే వ్యాపారాలు, పరువు కాపాడుకోవటానికి బీఆర్ఎస్‌ను వదులుకుని కాంగ్రెస్, కమలం పార్టీల్లోకి చేరిపోతున్నారు. అధికార పార్టీలోకి జంపింగ్‌లు అన్నవి సర్వ సాధారణమే.. ఇదేం కొత్త విషయమేమీ కాదు. కానీ.. మునుపెన్నడూ రాజకీయాల్లో లేని విధంగా ఇప్పుడు బీఆర్ఎస్‌కు ఈ పరిస్థితి రావడంతో ఇప్పుడంతా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కొట్టాలన్నది కాంగ్రెస్ టార్గెట్.. తదుపరిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం చిన్నపాటి లీడర్ వచ్చినా సరే పార్టీకి ఏదో విధంగా ఉపయోగపడతారని కండువాలు కప్పేస్తున్నారు కాంగ్రెసోళ్లు. ఈ చేరికలు, మార్పులు, చేర్పులతో అధికార పార్టీ ఏ మాత్రం లాభపడుతుంది.. ఎన్ని సీట్లు కొడుతుందో చూడాలి మరి.