ఆపరేషన్ బీఆర్ఎస్.. ఇవన్నీ దేనికి సంకేతం!
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడమే అన్ని చిక్కులకు కారణంగా తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ అహంకార ధోరణి.. తెలంగాణలో మాకు ఎదురు లేదన్న ధీమా.. పార్టీని ఇప్పుడు ఈ స్థాయిలో నిలిపింది. తెలంగాణలో ఎన్నో దారుణాలు జరిగినా.. ఎన్నో ఘోర రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు దుర్మరణం పాలైనా కేసీఆర్ స్పందించిన పాపాన పోలేదు. ప్రతి విషయంలోనూ మోనార్కిజం ప్రదర్శించారు. మొత్తానికి కేసీఆర్‌కు గట్టి దెబ్బే తగిలింది. ఆ దెబ్బ ఎఫెక్ట్ పార్టీపై బలంగానే ఉంది. అప్పటి నుంచి పార్టీ పతనం ప్రారంభమైంది. పార్టీ నేతలంతా తలోదారి చూసుకుంటున్నారు. ఇన్నాళ్లూ కదిలించాలా.. వద్దా? అనుకుంటున్న ఢిల్లీ లిక్కర్ స్కాంను ఈడీ కదిలించడమే కాకుండా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ కూడా చేసింది.
పొత్తు పెట్టుకుంటే నష్టమే..!
నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పార్టీ నుంచి ఏ ఒక్క నేతా బయటకు వెళ్లేవారు కాదు. పైగా కవిత అరెస్ట్ అనేది జరిగేదే కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం కవితను అరెస్ట్ చేయించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ పట్టు సాధించాలని చూస్తోందని టాక్. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌ను బలహీన పరుస్తోందని తెలుస్తోంది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆ మధ్య ప్రచారం బీభత్సంగా సాగింది. కానీ పరిస్థితులను అంచనా వేసిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందం ఇరు పార్టీల మధ్య ఉందన్న టాక్ కారణంగానే నష్టపోయామని.. ఈసారి పొత్తు పెట్టుకుంటే మరింత నష్టపోతామని భావించిందట. దీంతో బీఆర్ఎస్‌ను బీజేపీ దూరం పెట్టేసింది. ఏం చేసైనా సరే రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మోదీ, షాల టార్గెట్‌గా తెలుస్తోంది.
ఆదేశాలేంటి..?
అయినా సరే.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న టాక్ నడుస్తోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే కవితను అరెస్ట్ చేయించిందని టాక్. ఆ వెంటనే కిషన్ రెడ్డితో పార్టీ నేతలకు కీలక ఆదేశాలు సైతం జారీ చేయించింది. ఏ ఒక్కరూ కవిత అరెస్ట్‌పై మీడియాతో మాట్లాడవద్దని తెలిపింది. అసలు కవిత అరెస్ట్‌కు.. బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని బీజేపీ అంటోంది. సంబంధం లేనప్పుడు మీడియా ఎదుట ఆమె అరెస్ట్‌పై మాట్లాడవద్దని ఆదేశాలెందుకు? ఒకవైపు బీఆర్ఎస్‌ను బలహీన పరిచేందుకు ఆపరేషన్ ఆకర్ష్.. మరోవైపు అంర్గత కార్యాచరణకు నడుం బిగించిందని టాక్. ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కవిత అరెస్ట్‌తో బీఆర్ఎస్ మరింత పతనమవుతుందని.. అప్పుడు ఇంకొంత మంది బీజేపీలో చేరతారని పార్టీ అంచనా వేస్తోందట. మొత్తానికి ఆపరేషన్ బీఆర్ఎస్ అయితే తెలంగాణలో ప్రారంభమైందని తెలుస్తోంది.. ఇది ఇంకెంత వరకూ వెళ్తుందో.. ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు ఎన్నెన్ని ఉంటాయో చూడాల్సిందే మరి.