అవును.. పిఠాపురం నుంచే పోటీచేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అలా ప్రకటించారో లేదో.. టీడీపీలో ప్రకంపనలు, వైసీపీలో వణుకు మొదలైంది. ఎలాగైనా సరే సేనానిని ఓడించాలని వైసీపీ పాచికలు మొదలుపెట్టింది. పవన్ ప్రకటనతో ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పట్నుంచీ మరో లెక్క అన్నట్లుగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి. దీంతో పిఠాపురం వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న వంగా గీతను పక్కనెట్టి.. కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను బరిలోకి దింపాలని వ్యూహం రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదిగో పవన్‌ను కలుస్తా.. జనసేనలో చేరుతానన్న ముద్రగడ సీన్ కట్ చేస్తే శుక్రవారం నాడు జగన్ పంచన చేరిపోయారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో పిఠాపురం వైసీపీ అభ్యర్థి మార్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఓడించి తీరాల్సిందే..!
2019 ఎన్నికల్లో పవన్ పోటీచేసిన గాజువాక, భీమవరం స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ రెండు స్థానాల్లోనూ ఓడించింది. అయితే ఈ రెండింటిలోనే ఏదో ఒక స్థానం ఎంచుకొని ఓడిన చోటే గెలిచి నిలవాలన్నది పవన్ టార్గెట్.. అయితే సర్వేలన్నీ సేనానికి పాజిటివ్‌గా రావడం, పైగా కాపులు కూడా ఎక్కువగా ఉండటంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పిఠాపురంను ఎంచుకున్నారు. అయితే 2019కు ముందే ఇక్కడ్నుంచి పోటీచేయాలని వ్యూహాత్మకంగా కల్యాణ్ వ్యవహరించినప్పటికీ అది జరగలేదు. దీంతో ఇప్పుడు పోటీచేస్తున్నట్లు పవన్ స్వయంగా ప్రకటించడంతో.. కార్యకర్తలు, వీరాభిమానులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే సీనియర్ నేతగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ మాత్రం పొత్తులో జనసేనకు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. అటు ఆయన అనుచరులు, కార్యకర్తలు.. వీరాభిమానులు రచ్చ రచ్చజేశారు. అయితే.. అప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఫోన్ రావడంతో కాసింత హడావుడి తగ్గినప్పటికీ.. వర్మ మాత్రం శాంతించలేదు. ఇంటికి పిలిపించుకుని మరీ.. కూటమి అధికారంలోకి రాగానే సముచిత స్థానం ఇస్తామని చెప్పి పంపించారు. అయినప్పటికీ వర్మ మాత్రం అస్సలు తగ్గట్లేదు.. అయితే వైసీపీలో చేరడమా.. లేకుంటే ఇండిపెండెంట్‌గా పోటీచేయడమా అనేది డిసైడ్ కావాలని చూస్తున్నారు. అయితే ఇదంతా వైసీపీ ఆడిస్తున్న పెద్ద డ్రామాయేనని టీడీపీ, జనసేన పార్టీ నేతలు కొందరు చెబుతున్న పరిస్థితి. పవన్‌ను ఓడించడానికే ఇదంతా వైసీపీ చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
వ్యూహం ఇదేనా..?
పిఠాపురం నుంచి నిన్న మొన్నటి వరకూ కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పోటీ చేయించాలని.. ఇంచార్జ్‌గా కూడా బాధ్యతలను కట్టెబ్టింది వైసీపీ. అయితే.. పవన్ ఇక్కడ్నుంచే పోటీచేస్తున్నారని ప్రకటించడంతో వైసీపీ వ్యూహం మార్చింది. గీతను మరో నియోజకవర్గానికి పంపి.. ఆమె స్థానంలో ముద్రగడను పోటీచేయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముద్రగడ పోటీపై వెనక్కి తగ్గితే ఆయన కుమారుడ్ని బరిలోకి దింపాలని కూడా వైసీపీ యోచిస్తోంది. ఇప్పటికే పిఠాపురంలో పరిస్థితిపై వైసీపీ రిజనల్ ఇంచార్జ్, ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు. నియోజకవర్గంలోని ప్రతిపంచాయతీపైన ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. రేపట్నుంచి.. ముద్రగడతో కలిసి గ్రామాలకు వెళ్లి.. కీలక వ్యక్తులు, కార్యకర్తలు, నేతలను కలిసే పనిలో ఉండనున్నారట. కాపు సామాజిక వర్గం ఓట్లు 91 వేలు ఉండటంతో ఏ ఒక్క ఓటూ పవన్‌కు పడకుండా ఉండాలన్నదే వైసీపీ టార్గెట్ అట. అంతేకాదు.. నియోజకవర్గంలోని మాలలు, శెట్టి బలిజలు, చేనేత కార్మికులు, బెస్తలను తమకు వైపునకు తిప్పుకునేందుకు గట్టి ప్లానే చేస్తోంది వైసీపీ. ఆయా వర్గాలకు చెందిన నేతలతో మిథున్ రెడ్డి, ముద్రగడ ఇద్దరూ మంతనాలు మొదలుపెట్టారు. పార్టీ టికెట్ ఆశించి దక్కించుకోలేని వర్మను.. అసంతృప్త నేతలను, కార్యకర్తలను.. ద్వితియశ్రేణి నేతలకు సైతం వైసీపీ గాలం వేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే స్థానికంగా అధికారుల మార్పులు కూడా ఇప్పటికే చేసేసింది వైసీపీ.
ఇటు ఒక్కడు.. అటు ఎందరో..!
చూశారుగా ప'వన్'ను ఒక్కడ్ని ఢీ కొట్టలేక వైసీపీ ఎక్కడ్నుంచి ఎక్కడి వరకూ వెళ్తున్నదో చూశారు కదా..! ఇటు ముద్రగడ.. అటు వంగా గీత.. మధ్యలో టీడీపీ అసంతృప్త నేతలనూ ఏ ఒక్కరినీ వదలకుండా తెగ వాడేస్తోంది అధికారపార్టీ. ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే స్వయంగా వైఎస్ జగన్ రెడ్డే రంగంలోకి దిగాలని కూడా భావిస్తున్నారట. పిఠాపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి పార్టీ పెద్దలు సన్నాహాలు చేస్తున్నారట. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, రోజా, ఇంకా కొందరు వైసీపీ యువనేతలను సైతం క్యాంపెయిన్‌కు దించాలని అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏం చేసైనా సరే పవన్‌ను ఓడిస్తే.. రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది.. ఇక్కడే పవన్ పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేయాలని జగన్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. మరి పవన్ వ్యూహం ఎలా ఉంటుందో.. ఏ మాత్రం వర్కవుట్ అవుతందో వేచి చూడాలి మరి.