Advertisement

ఏపీ కూటమిదేనా.. మళ్లీ వైసీపీనేనా..


ఏపీలో విజయం ఎవరిది.. ఓటరు ఎటువైపు..!?

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం అంతుచిక్కట్లేదు..! ప్రజల నాడిని పట్టుకోలేక పేరుగాంచిన సర్వే సంస్థలు సైతం ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఎందుకంటే.. మొదట టీడీపీ-జనసేన మాత్రమే కూటమిగా వెళ్తున్నట్లు ప్రకటించడం.. ఇప్పుడిక బీజేపీ కూడా జతకట్టడం.. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిలో  చేరిపోవడంతో అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. బీజేపీ రావడంతో బరాబర్ గెలుస్తామని కూటమి చెప్పుకుంటున్నప్పటికీ.. ఉండే మైనస్‌లు మాత్రం భారీగానే ఉన్నాయి. ఇక వైసీపీ మాత్రం నవరత్నాలు.. ప్రతి ఇంటికి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధియే రెండోసారి అధికారంలోకి రావడానికి తోడ్పడుతుందని ధీమాగా ఉంది. అయితే.. ఒకట్రెండు సర్వేల్లో తప్ప .. దాదాపు అన్ని సర్వేలు టీడీపీ-జనసేన కూటమిదే విజయమని చెప్పినప్పటికీ బీజేపీ వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ఇక వైసీపీ పరిస్థితి ఘోరంగా ఉందని పలు సర్వేలు తేల్చడం.. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడానికి వ్యూహ రచన చేసిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం వైసీపీ రానే రాదని తేల్చిచెప్పేశారు. ఈ పరిస్థితుల్లో నిజంగానే కూటమి గెలుస్తుందా..? వైసీపీ గెలుస్తుందా..? అనేదానిపై Cinejosh.com విశ్లేషణాత్మక కథనం.

వైసీపీ సంగతేంటి..?

ఏపీలో విజయం ఎవరికి దక్కేను..? ఇప్పుడిదే గల్లీ నుంచి ఢిల్లీ.. తెలుగోడు ఉన్న విదేశాల్లో కూడా జరుగుతున్న చర్చ. ప్రజలు కూటమి వైపు ఉన్నారా..? వైసీపీకి ఓటేస్తారా..? అనేది తెలియట్లేదు. ఎందుకంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఏ మాత్రం చేసింది అనేది రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. దీనికి తోడు జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు మొలుకుని ఏ రంగాల వారూ ప్రశాంతంగా లేరన్నది జగమెరిగిన సత్యమే. నిత్యం ఏదో ఒక వివాదమే ఊపిరిగా ప్రభుత్వం నడిచింది.. ఇంకా నడుస్తోంది కూడా. ఇక ప్రభుత్వ పథకాలు అంటారా..? కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం అని జగన్ పైకి చెప్పారే కానీ గ్రౌండ్ లెవల్‌లో మాత్రం అస్సలు అలా లేనేలేదు. ఇది ఏ ఒక్క వలంటీర్‌ను అడిగినా ఇట్టే అందరికీ అర్థమైపోతుంది. సచివాలయ వ్యవస్థ కంటే జన్మభూమి కమిటీలు వెయ్యి రెట్లు బాబోయ్ అని ప్రజలు కుయ్యో మర్రో అని మొత్తుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. రాష్ట్రానికి ఉన్న అమరావతి రాజధానిని పక్కనెట్టి మూడు ముక్కలాట ఆడి.. చివరికీ ఏదీ లేకుండా చేశారు. ఇదిగో మా రాజధాని అని చెప్పుకోవడానికి సగడు ఆంధ్రుడికే సిగ్గుగా ఉన్న పరిస్థితి. ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరం ఏమైందో ఎవరికీ తెలియదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి.. ఇంతవరకూ ఒక్కటీ చేసింది లేదు. రైతన్నల కష్టాలైతే ఇక మాటల్లో చెప్పలేం. మహా అంటే నాడు-నేడులో భాగంగా స్కూల్స్, ఆస్పత్రులు మాత్రమే జగన్ ఖాతాలో ప్రస్తుతం ఉన్నాయ్. ఖాతాలో లేనివి.. ఇచ్చిన హామీలు నెరవేర్చనివి సవాలక్ష ఉన్నాయ్. ఇవన్నీ జగన్‌కు పెద్ద మైనస్‌ కాబోతున్నాయ్ అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

కూటమి కూలుతుందా.. లేస్తుందా..?

ఇక కూటమిలోని పార్టీల విషయానికొస్తే.. ఒక్కో పార్టీ గురించి చెప్పుకోవడానికి ఒక రోజంతా సరిపోదు. పొత్తులకు పెట్టిన పేరు టీడీపీ అధినేత చంద్రబాబు అని ఆరోపణలు ఉన్నాయ్. ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీచేసిన దాఖాలాల్లేవ్. కనీసం సర్పంచ్ ఎన్నికల్లోనూ ఈ పరిస్థితి లేదు. ఒకప్పుడు చీ కొట్టిన.. చీదరించుకున్న బీజేపీతోనే ఇప్పుడు జతకట్టారు బాబు. ఇటు జనసేన పరిస్థితి కూడా ఇదే.. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసినట్లే ఈసారి చేసుంటే సీన్ వేరేలా ఉండేదన్నది విశ్లేషకులు చెబుతున్నారు.. కానీ చంద్రబాబు సంకనెక్కడం ద్వారా పవన్‌ బ్లండర్ మిస్టేకే చేశారని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఇక బీజేపీ గురించి చెప్పాలంటే పేజీలు, రోజులు సరిపోవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్‌ను బీజేపీ డిమాండ్ చేసినవి కొండంత ఉన్నాయ్. ప్రత్యేక హోదా మొదలుకుని రైల్వే జోన్.. ప్రత్యేక నిధులు ఇలా ఒకటా రెండా చాలానే ఉన్నాయ్. సీన్ కట్ చేస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ అడ్రస్సే లేదు. ఒక్క హామీనీ నెరవేర్చకపోగా.. తిరిగి రివర్స్ అటాక్ చేస్తోంది. అన్నీ ఇచ్చేశాం.. ఇవ్వాల్సినవి ఇంకేం లేవు అని తెగ చెప్పుకుంటోంది. ఇప్పుడు టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరడంతో ప్రజలు ఏ మాత్రం ఆదరిస్తారన్నది పెద్ద ప్రశ్నార్థకమే. ఈ మూడు పార్టీలు ఇప్పుడు ప్రజల్లోకి వెళితే ఏం చెప్పాలి..? అనేది ఎవరికీ తెలియట్లేదు.

మేలు చేసిందెవరికి..?

రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్‌కు ఒరగబెట్టిందేంటి..? అంటే చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటీ లేవు. పైగా.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీ పెద్దలు ఎంత సేఫ్ గేమ్ ఆడారో అందరికీ తెలిసిందే. జగన్‌తో ఎప్పటికైనా అవసరం పడుతుంది.. పైగా కాంగ్రెస్ కూటమిలో ఆయన చేరే ఛాన్స్ లేదు గనుక బీజేపీ తెగ వాడేసింది. ఏదైనా బిల్లులకు ఆమోదం మొదలుకుని.. అన్ని విషయాల్లోనూ వైసీపీ సపోర్టు తీసుకుంది. ఇందుకు ప్రతిఫలంగా వైఎస్ జగన్ ఏం అడిగినా కాదనకుండా ఇచ్చేసింది. అందుకే ఇప్పుడు ఆంధ్రా అప్పుల కుప్పగా మారిపోయింది. అప్పులు తెచ్చి జగన్ ఏం ఉద్దరించార్రా అంటే.. నవరత్నాలకే పెట్టేశారు. అది కూడా తన సొంత జేబులోకి ఎంత వెళ్లిందో పైనున్న పెరుమాళ్లకు తప్ప ఎవరికీ అర్థం కాదు.. అర్థం చేసుకోవాలన్నా అస్సలు కుదరదు. కాస్త నిశితంగా పరిశీలించిన సగటు ఆంధ్రుడికి కేంద్రంలోని మోదీ సర్కార్ వల్ల.. జగన్ బాగుపడ్డారా..? ఏపీ బాగుపడిందా..? అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సో.. చూశారుగా కూటమికి ఎన్ని మైనస్‌లు ఉన్నాయో.. అంతకుమించి వైసీపీకీ ఉన్నాయ్. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రా ఓటరు ఫైనల్‌గా ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఇప్పట్లే తేలేలా లేదు. ఇక కూటమి కుప్పకూలుతుందా..? విజయం మళ్లీ వైసీపీనే వరిస్తుందా..? అనేది తెలియాలంటే ఇంకో నెలన్నర వరకూ వేచి చూడాల్సిందే మరి.

AP alliance.. YCP again..?:

YSRCP will have direct alliance with people?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement