పవన్ ప్రకటన.. 'వర్మ'లు రచ్చ రచ్చ!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీచేస్తున్నట్లు స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుగా పవన్ ఎక్కడ్నుంచి పోటీచేస్తారో తెలియక కాసింత ఆందోళన చెందిన జనసేన శ్రేణులు.. ఇప్పుడిక అధికారిక ప్రకటన రావడంతో ఎగిరిగంతులేస్తున్నారు. మరోవైపు.. ఈ ప్రకటనతో వైసీపీలో ఒక్కసారిగా మొదలవ్వగా.. టీడీపీ శ్రేణుల్లో ప్రకంపనలు రేగుతున్నాయ్. పిఠాపురం టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ ఒక్కసారిగా డీలాపడిపోయారు. దీంతో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, వర్మ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు చించి, పార్టీ కరపత్రాలు దగ్ధం చేసి రచ్చ రచ్చ జేశారు. తమ అభిమాన నేతకు కాకుండా పవన్‌కు ఎలా ఇస్తారంటూ టీడీపీ, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
ఎందుకింత రచ్చ..?
వాస్తవానికి.. పవన్ పోటీ పిఠాపురం నుంచే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నప్పటి నుంచి వర్మ నిట్టూరుస్తూనే ఉన్నారు. ఆయన నేరుగా రంగంలోకి దిగకపోయినప్పటికీ.. తన అనుచరులు, కార్యకర్తలను రంగంలోకి దింపేశారు. "నాన్ లోకల్ వద్దు.. లోకల్ ముద్దు" అంటూ పోస్టర్లు, పెద్ద ఎత్తున బ్యానర్లు సైతం వేయించారు. సీన్ కట్ చేస్తే అనుకున్నట్లుగానే వర్మను కాదని పొత్తులో భాగంగా పిఠాపురంను జనసేనకు ఇచ్చేశారు చంద్రబాబు. దీంతో ఇది జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. పొత్తు ధర్మం పాటించాలని అటు పవన్.. ఇటు చంద్రబాబు పదే పదే చెబుతున్నప్పటికీ అవన్నీ తుంగలో తొక్కి టీడీపీ శ్రేణులు ఇలా చేస్తుండటం గమనార్హం. జనసేన స్ట్రాంగ్‌గా రాజమండ్రి రూరల్‌తో పాటు చాలా స్థానాలను చేజేతులా పవన్ వదులుకున్నప్పుడు ఆ పార్టీ శ్రేణులు ఎక్కడా రచ్చ చేయలేదు కదా.. మరి తెలుగుదేశం ఎందుకింత రచ్చ చేస్తోందో అర్థం కాని పరిస్థితి. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
అటు ఇటు వర్మలే..!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీడీపీ నేత వర్మ.. వైసీపీ పెద్దలకు టచ్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇందులో భాగంగానే పవన్ ప్రకటన తర్వాత ఇంత హడావుడి చేస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీన్‌లోకి ఎంటరయ్యారు. అటు ఆ వర్మ రచ్చ చేస్తుంటే.. ఇటు ఈ వర్మ ట్విట్టర్‌లో రెచ్చిపోయారు. అవును.. సడన్‌గా నిర్ణయం తీసుకుంటున్నాను పిఠాపురం నుంచి పవన్‌పై పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు ఆర్జీవీ. దీంతో వర్మను ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. మరి ఇద్దరి వర్మల రచ్చను జనసేనాని.. టీడీపీ అధినేత ఎలా తీసుకుంటారో చూడాలి మరి.