ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన సర్దుబాటు పంచాయితీ కొలిక్కి చేరుకున్న విషయం తెలిసిందే. అధికారిక లెక్కలూ వచ్చేశాయ్. 8 గంటల పాటు కూర్చొని మరీ సీట్ల సర్దుబాబు విషయంలో ఓ నిర్ణయానికి మూడు పార్టీలు వచ్చేశాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ కూడా ఉంది. బీజేపీ కోసం జనసేన 3 స్థానాలను త్యాగం చేస్తే.. టీడీపీ ఒక స్థానాన్ని త్యాగం చేసింది. అసలే సీట్లు తక్కువని జనసేన నేతలూ.. కేడర్ మొత్తుకుంటుంటే ఇప్పుడు ఉన్న 24 లోనే మరో మూడు కోత పడ్డాయి. ఒక ఎంపీ సీటును సైతం జనసేన త్యాగం చేసింది. ప్రస్తుతం జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లకు పరిమితమైంది. బీజేపీకి 6 ఎంపీ సీట్లు.. 10 ఎమ్మెల్యే స్థానాలు తీసుకుంది.
పార్టీ కేడర్ ఎలా అర్థం చేసుకుంటుంది?
ఇక టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. కనీసం కార్పొరేటర్‌ని కూడా గెలిపించుకోలేని బీజేపీకి 10 ఎమ్మెల్యే స్థానాలు.. 6 ఎంపీ సీట్లు ఇవ్వడం పట్ల జనం విస్తుబోతున్నారు. పార్టీలకు పర్సనల్‌గా ఉన్న ఓటు బ్యాంకు ప్రకారం సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే బీజేపీకి చాలా ఎక్కువ స్థానాలను అప్పనంగా కట్టబెట్టినట్టే అవుతుంది. ఇప్పుడు జనసేన త్యాగాన్ని ఆ పార్టీ కేడర్ ఎలా అర్థం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 24 సీట్లకే నానా రచ్చ చేసిన నేతలు 21 సీట్లే అంటే అంగీకరిస్తారా? రచ్చ చేస్తారా? పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
డిపాజిట్లపై కూడా ఆశలు వదులుకోవాల్సిందే..
ఇటు టీడీపీ కూడా తనకున్న బలం ప్రకారం చూసుకుంటే అన్ని సీట్లు త్యాగం చేయకూడదు. తమకేదో ఎంపీ సీట్లు పెద్ద ఎత్తున కావాలి కాబట్టి 6 ఎంపీ సీట్లకు బీజేపీ పట్టుబట్టిందంటే ఓకే కానీ.. అసెంబ్లీ సీట్లలో డబుల్ డిజిట్ కావాలని పట్టుబట్టడమే ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. ఆ పార్టీలో నేతలూ పెద్దగా లేరు. ఏపీలో ఆ పార్టీకి కేడరూ లేదు. కేవలం టీడీపీ, జనసేన కేడర్‌పైనే ఆధారపడి విజయం సాధించాలి తప్ప సొంత కేడర్‌పై ఆధారపడితే మాత్రం డిపాజిట్లపై కూడా ఆశలు వదులుకోవాల్సిందే. మొత్తానికి సీట్ల సర్దుబాటు అయితే కుదిరింది. మరి బీజేపీని అలయన్స్‌లో చేర్చుకోవడం లాభాన్నిస్తుందో.. నష్టాన్నిస్తుందో చూడాలి. మొత్తానికి టీడీపీ, జనసేనల త్యాగానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో ఏమో కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు.