జోరీగ.. జోగయ్య మళ్లీ మొదలెట్టారుగా!
ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనుకటికొకడు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రచారం కూడా ఇలాగే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. సీట్ల పంపకంలో భాగంగా ఎవరికెన్ని ఏంటో కూడా తేల్చేసుకున్నారు. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేయనున్నారంటూ ప్రచారం ప్రారంభమైంది. ఇది ఎంతవరకూ నిజమనేది ఎవరికీ తెలియదు. కానీ వైసీపీ దానిని చిలవలు పలవలు చేసి ప్రచారం చేస్తోంది. పవన్‌ను కేంద్ర మంత్రిగా పంపించేసి.. జనసేనను తమ పార్టీలో కలిపేసుకుని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్‌కు రాష్ట్రాన్ని చుట్టి పెట్టేయాలని టీడీపీ అధినేత ప్లాన్ అట.
వేరొక పార్టీలో విలీనం చేస్తారా?
అందులో భాగంగానే పవన్‌తో ఎంపీగా పోటీ చేయించి కేంద్ర మంత్రిగా పంపించేందుకు స్కెచ్ గీసిందట. వాటే స్టోరీ సర్‌జీ.. పవన్ ఏమైనా పాలు తాగే పసివాడా? స్కెచ్‌లు గీస్తే పడిపోయి.. పార్టీని టీడీపీలోనో.. బీజేపీలోనో విలీనం చేసేందుకు? గత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటే గెలిచినా కూడా పవన్ తిరిగి కెరటం మాదిరిగా లేచారు. పార్టీని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వేరొక పార్టీలో విలీనం చేస్తారా? ఒకవేళ పవన్ ఎంపీగా పోటీ చేసినా కూడా ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయ్. ఆ లెక్కల సారాంశం పార్టీ విలీనం కాదు. అలా చేయాలనుకుంటే ఏనాడో చేసేవారు. వైసీపీ అంటే విపక్షాలను విమర్శించాలి కాబట్టి విమర్శిస్తోంది. మరి ఆ పెద్దాయనకు ఏమైంది?
కుల ప్రస్తావన ఎందుకు?
అదేనండి.. హరిరామ జోగయ్య. ఊ అంటే.. ఆ అంటే లేఖలు రాసేస్తారు. సలహాలు ఇస్తారు.. డిమాండ్లు చేస్తారు. వైసీపీ మైక్‌గా మారి మరీ పవన్‌పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఆ ఆలోచన విరించుకోవాలని పవన్‌కు ఒక లేఖ రాశారు. రాష్ట్రాన్ని పాలించిన అనుభవం, రాష్ట్ర అధికారంలో భాగస్వామ్యం కావాలనుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయాలన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. రాష్ట్రంలో కాపు ప్రాతినిధ్యం బలంగా లేకుంటే రెడ్డి, కమ్మ ప్రాబల్యం పెరుగుతుందట. మధ్యలో కుల ప్రస్తావన ఎందుకు? పోనీ తన కులాన్ని పైకి లేపడం కోసం హరిరామ జోగయ్య లేఖలు రాయడం తప్ప ఏం చేస్తున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఏదైనా చిన్న విషయం తెలిస్తే చాలు లేఖ అందుకుని మొదలు పెట్టేస్తారు. మరి నిజంగా ఆయన తన ఆలోచనలో నుంచి వచ్చినవే రాస్తారా? ఎవరైనా ఇచ్చిన స్క్రిప్ట్‌ను తన మాటగా చెబుతారో తెలియదు.