టీడీపీ, జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు కూడా ఓ కొలిక్కి వచ్చింది. మరో ఐదారు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సైతం రానుంది. మరి బీజేపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎంతసేపూ టీడీపీ అధినేత చంద్రబాబు లేదంటే జనసేన అధినేత పవన్ కల్యాణో హస్తినకు పరిగెత్తడం.. చర్చలు జరిపేసి రావడం తప్ప అక్కడి నుంచి ఎలాంటి కబురూ - కాకరకాయ ఏమీ లేదు. ఇలాంటి తరుణంలో బీజేపీతో పొత్తు ఈ రెండు పార్టీలకు అవసరమా? అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎందుకు రెండు పార్టీలు బీజేపీతో పొత్తు కోసం అంతలా ఉవ్విళ్లూరుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీని ఎదుర్కోలేరా? అంటే అదీ కాదు కదా.
రెండు మాటలు మార్చారు..
వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆయన పార్టీ నేతలంతా ఎవరి గొయ్యి వారు తీసుకున్నారు. మరోసారి విశాఖ రాజధాని అంటూ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ రాజధాని అని.. ఆ తరువాత విశాఖ రాజధాని అని.. కేవలం పది రోజుల్లోనే జగన్ రెండు మాటలు మార్చారు. ఇక ఆది నుంచి అయితే చెప్పనక్కర్లేదు. సెక్రటేరియట్ తాకట్టు పెట్టి మరో దారుణం. అసలు ఆయనది జగ్లక్ పాలన అని ఏనాడో జనం తేల్చేశారు. ఇలాంటి తరుణంలో రెండు పార్టీలు చక్కగా సీట్లు పంచుకుని పోటీ చేసుకోక కనీసం సింగిల్‌గా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కించుకోలేని బీజేపీ కోసం ఎందుకంతలా తాపత్రయ పడుతున్నారంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక వైసీపీ నేతల విమర్శలకైతే అంతే లేదు.
రెండు సీట్లపై కొనసాగుతున్న కసరత్తు..
ఇక చంద్రబాబు నేడో రేపో హస్తినకు బయలుదేరనున్నారు. ఆయన వెళితే కానీ పొత్తు విషయంపై క్లారిటీ వచ్చేలా లేదు. ఇక జనసేనకు పలు దఫాల చర్చల తర్వాత 24 సీట్లను చంద్రబాబు ఫిక్స్ చేశారు. నిన్న చంద్రబాబు, పవన్ గంటన్నర పాటు భేటీ అయి రెండు సీట్లు మినహా అన్ని స్థానాలను డిసైడ్ చేశారు. ఆ ప్రకారం.. జనసేనకు ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 6, తూర్పుగోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణాజిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా ల్లో ఒక్కోచోట జనసేన బరిలోకి దిగనుంది. పెందుర్తి, అమలాపురంపై మాత్రం కసరత్తు కొనసాగుతోంది. అయితే ఈ సీట్లను ఆశించిన టీడీపీ నేతలంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. వాళ్లందరినీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుజ్జగించే పనిలో ఉన్నారు.