ఒకటోసారి.. రెండోసారి.. ఇంకెన్ని సార్లు చర్చలు?
ఏపీలో పొత్తులపై ఇంకా పార్టీ నేతలతో చర్చించే దగ్గరే ఉంది బీజేపీ అధిష్టానం. కొద్ది రోజుల క్రితం అన్ని రాష్ట్రాల నేతలతో రాత్రంతా వరుస సమావేశాలు నిర్వహించి మొత్తానికి తొలి ఎంపీ అభ్యర్థుల జాబితాను అయితే బీజేపీ విడుదల చేసింది. ఆ తరుణంలోనూ ఏపీలో పొత్తులపై బీజేపీ తమ పార్టీ నేతలతో చర్చించినట్టు సమాచారం. ఇక గత రాత్రి అంటే అర్ధరాత్రి దాటే వరకూ ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో బీజేపీ పెద్దలు చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో భాగంగా.. ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికతో పాటు ఏపీలో పొత్తులు, స్థానాలపై బీజేపీ అధిష్టానం చర్చించినట్టు సమాచారం.
నేడు ఢిల్లీకి చంద్రబాబు..
అయితే ఏపీలో పొత్తుల విషయం మాత్రం అర్ధాంతరంగానే ముగిశాయట. ఏ విషయమూ తేలలేదని సమాచారం. ఇవాళ తిరిగి ఏపీకి చెందిన బీజేపీ నేతలతో అధిష్టానం భేటీ కానుందట. కోర్ గ్రూప్ భేటీల్లోనూ ఏపీలో పొత్తులపై ప్రస్తావన వచ్చిందట. కానీ ఏదీ తేలనే లేదట. మరి ఇటు చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పయనమవుతున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఆయన హస్తినకు బయలుదేరారు. నిన్న పవన్‌తో జరిగిన సమావేశంలో ఢిల్లీ పర్యటన, పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు చర్చించారు. ఇవాళ రాత్రి ఢిల్లీలో బీజేపీ నేతలతో చర్చించనున్నారు. నేటి రాత్రి చంద్రబాబు ఢిల్లీలోనే బస చేయనున్నారు.
టికెట్ వస్తుందా.. రాదా? అన్న టెన్షన్‌లో నేతలు..
ఇవాళ ఉదయం ఏపీ బీజేపీ నేతలతో అధిష్టానం తిరిగి పొత్తుల విషయమై చర్చలు అయితే జరుపుతుందని టాక్. మరి ఇవాళ ఉదయం కూడా కొలిక్కి రాకుంటే పరిస్థితి ఏంటి? చంద్రబాబుతో ఎప్పటి మాదిరిగానే ఏదో మాట్లాడేసి పంపించేస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈసారి కూడా చర్చలు సత్ఫలితాన్నివ్వలేదంటే.. అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీ నేతలు తీవ్ర నిరుత్సాహానికి గురవడం ఖాయం. అసలే తమకు టికెట్ వస్తుందా? రాదా? అన్న టెన్షన్‌లో ఉన్న నేతలకు ఈ వెయిటింగ్ మరింత అసహనాన్ని కలిగిస్తుంది. మరోపక్క వైసీపీ నేతలు చాలా వరకూ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. దీంతో నేతలు మరింత ఆందోళన చెందుతున్నారు. పైగా నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ రావడం ఖాయం. ఇంకా తేల్చకుంటే కష్టమే. ఇక చూడాలి ఏం జరుగుతుందో..