రేవంత్ రెడ్డి.. మన కళ్ల ముందు ఎదిగిన నేత. సీఎంగా గతంలో పని చేసిన అనుభవం లేదు. ఆయన కుటుంబంలోనూ సీఎంలు అయినవారు లేరు. అలాంటి వ్యక్తి సీఎం అయ్యాక ఎలాంటి తడబాటూ లేకుండా పాలన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అంటే ముణ్ణాళ్ల ముచ్చటే అనుకున్నారంతా. పార్టీ సీనియర్స్ ఎవరూ ఆ సీట్లో ఎవ్వరినీ కూర్చోనివ్వరని భావించారు. కానీ ఎవరికి వారు కామ్ అయిపోయారు. సీఎంగా రేవంత్‌ను సమర్థిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలోనే అంతా నడుస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి సైతం ఎవ్వరినీ కించపరిచే కార్యక్రమాలేవీ పెట్టుకోవడం లేదు. ప్రమాణ స్వీకారం రోజే మాజీ సీఎం కేసీఆర్ కాలు జారి పడిపోతే.. వెంటనే అధికారులతో మాట్లాడి తగిన భద్రతను ఏర్పాటు చేసి వావ్ అనిపించారు.
ఇద్దరితోనూ కయ్యమే..
ఇక గవర్నర్ తమిళిసైకి కేసీఆర్ ఏమాత్రం గౌరవం ఇచ్చేవారు కాదు. రేవంత్ అలా కాదు.. గవర్నర్‌కు ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ప్రధాని వచ్చారంటే.. ఆ రోజున కేసీఆర్‌కు జ్వరమో.. ఏదో ఒకటి వచ్చేది. ఆయనకు ఎప్పుడూ అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికేవారు. అటు గవర్నర్.. ఇటు ప్రధాని ఇద్దరితోనూ కయ్యం పెట్టుకున్నారు. దీని వలన కేసీఆర్‌తో పాటు రాష్ట్రం కూడా ఎంతో కొంత నష్టపోయింది. పైగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ అందరూ తన బాటలోనే నడవాలనుకుని ఏకాకిగా మారారు. అయితే ప్రధానిని స్వయంగా రేవంత్ వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. ప్రధానిని పెద్దన్నగా సంబోధించారు.
విధేయత చూపిస్తున్న రేవంత్..
అటు పార్టీలో తనను వ్యతిరేకించిన వారిని కలుపుకు పోతున్నట్టుగానే ప్రధానికి కూడా పార్టీతో సంబంధం లేకుండా ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. అటు పాలనలోనూ ది బెస్ట్ అనిపించుకుంటున్న రేవంత్.. ఇటు ప్రవర్తన పరంగానూ ది బెస్ట్ అనిపించుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నా వాటిని ప్రతిపక్షాలు సహజంగా చేసే కామెంట్స్ గానే తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కనీసం తమ పార్టీ అధిష్టానం ప్రధాని మోదీతో ఇంత సఖ్యంగా ఉన్నందుకు ఏమంటుందో ఏమో అని కూడా ఆలోచించకుండా రేవంత్ విధేయత చూపిస్తున్నారు.రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో సఖ్యత తప్పనిసరి అని రేవంత్ చెబుతున్నారు. ఆయన పరిపాలన దక్షతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.