ఏపీ సచివాలయం తాకట్టు.. వదిలేదేలే !
అవును.. అప్పు ఇస్తామంటే దేన్ని తాకట్టు పెట్టడానికైనా తగ్గేదేలే అంటూ పరిపాలన సాగిస్తున్నారు సీఎం వైఎస్ జగన్.!. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని కోట్లు అప్పు చేశారో లెక్కేలేదు. తాకట్టుకు కాదేదీ అనర్హం అన్నట్లుగా ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టేసింది ప్రభుత్వం. రూ. 370 కోట్ల రూపాయిలకు హెచ్‌డీఎఫ్‌సీకి రాసిచ్చేశారు. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటకు తెరలేపిన జగన్.. ఆ మూడు సంగతి దేవుడెరుగు.. ఉన్న ఒక్క అమరావతిని అమ్మేసే పనిలో నిమగ్నమయ్యారు. చంద్రబాబు హయాంలో 700 కోట్ల రూపాయిలతో సచివాలయాన్ని నిర్మించగా.. ఇప్పుడు దీన్నే జగన్ తాకట్టుపెట్టేశారు. ఇన్నాళ్లు అడ్డగోలుగా తెచ్చిన అప్పులు చాలవన్నట్లు ఇప్పుడు మరో దా‘రుణా’నికి పాల్పడ్డారని ప్రతిపక్షలు తిట్టిపోస్తున్నాయి. మరోవైపు.. నవ్యాంధ్ర ఆత్మ గౌరవ ప్రతీక, ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రధాన వేదికైన సచివాలయాన్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటు అంటూ రాజకీయ విశ్లేషకులు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇదీ అసలు కథ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండోసారి గెలవడానికి ఏ ఒక్క చిన్న ఛాన్స్ వచ్చినా సరే సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు జగన్. సరిగ్గా ఈ టైమ్‌లోనే రూ. 370 కోట్లు అప్పు కావాల్సి ఉండటంతో ఐసీసీఐ బ్యాంకును సంప్రదించగా అబ్బే మేం ఇవ్వలేం.. కుదరదు అని తేల్చేయడంతో.. హెచ్‌డీఎఫ్‌సీని సంప్రదించగా అప్పు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రుణానికి గాను తాకట్టు పెట్టడానికి ఏముందని బ్యాంక్ అడగ్గా సచివాలయంకు సంబంధించిన పత్రాలు చూపించారట ప్రభుత్వాధికారులు. అయితే.. ఊరికే పేపర్లు చూపిస్తే సరిపోదు.. సచివాలయం భవనాలు తాకట్టు రిజిస్ట్రేషన్ చేయిస్తేనే మొత్తం నిర్మాణ వ్యయంలో సగం డబ్బులు అప్పుగా ఇస్తామని బ్యాంక్ చెప్పిందట. దీంతో హమ్మయ్యా.. అప్పు దొరికిందంటూ సచివాలయం భవనాలను హెచ్‌డీఎఫ్‌సీకి తాకట్టు రిజిస్ట్రేషన్ చేయించేసింది జగన్ సర్కార్.
ఏదీ వదలను..?
ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఇప్పటికే మార్చేసిన జగన్.. ఇంకా ఏ విధంగా అప్పు పుట్టించొచ్చు అని నిపుణులను అడిగి మరీ సలహాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. అప్పు ఇస్తానంటే చాలు.. దేన్నయినా తాకట్టు పెట్టడానికి "సిద్ధం"గా ఉన్నట్లు దీన్నిబట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల భవన సముదాయాలను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చేందుకు ప్రక్రియ మొదలైందని ప్రచారం జరుగుతోంది. చూశారుగా.. ఒకప్పుడు అమరావతి అస్సలు వద్దని.. స్మశానం అని.. ఎడారి అని.. వైసీపీ పెద్దలు ఏ రేంజ్‌లో దుష్ప్రచారం చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడే అదే ఎడారినే 370 కోట్ల రూపాయిలకు తాకట్టు పెట్టేశారు జగన్. అయితే.. ప్రజల ఆస్తులు, సంపదను తాకట్టు పెట్టడం జగన్‌కు కొత్తేమీ కాదు.. ఇప్పటికే రాష్ట్రంలోని లిక్కర్ వ్యాపారాన్ని రూ. 48 కోట్లు.. వైజాగ్‌లోని ప్రభుత్వ ఆస్తులను రూ. 25వేల కోట్లు.. రోడ్డు, భవనాల శాఖ ఆస్తులను తాకట్టుపెట్టి ఏకంగా రూ. 7వేల కోట్లు అప్పు తెచ్చేశారు జగన్. ఒక్కసారి అధికారం ఇస్తేనే ఈ పరిస్థితి వచ్చిందంటే.. ఇక రెండోసారి కూడా అధికారమిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.