లోకేష్‌ను ఎదుర్కోవడానికి ఇంకెంత మంది?
ఇన్‌చార్జుల స్థానాలన్నీ ఫిక్స్ కాదు.. మార్పులు, చేర్పులుంటాయని వైసీపీ సీనియర్ నేత ఒకరు కొద్ది రోజుల క్రితమే చెప్పేశారు. ఆ ప్రకారమే ఇప్పడు జరుగుతోంది. మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని.. గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలను వైసీపీ అధినేత అప్పగించారు. దీంతో తానే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ గంజి నియోజకవర్గమంతా పర్యటిస్తూ ప్రచారం కూడా ప్రారంభించేశారు. మురిపెం మూణ్ణాళ్లేనని.. గంజి మురిపెం కూడా ఎన్నో రోజులు ఉండలేదు. ఆయనను తొలగించేసి గత రాత్రి ప్రకటించిన 9వ జాబితాలో మంగళగిరి ఇన్‌చార్జి స్థానాన్ని మురుగుడు లావణ్యకు అప్పగించేశారు. మంగళగిరిలో గంజి పోయే మురుగుడు లావణ్య సీన్‌లోకి వచ్చేశారు.
నారా లోకేష్ చాలా స్ట్రాంగ్..
అసలెందుకు మంగళగిరి స్థానాన్ని మార్చాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో అక్కడి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నుంచి ఆర్కే పోటీ చేసి విజయం సాధించారు. అలాంటి ఆర్కేను ఈసారి జగన్ పక్కనబెట్టేశారు. గంజి పేరు అనౌన్స్ చేశారు. తిరిగి ఆయన్ను కూడా తప్పించేశారు. ఇప్పుడు లావణ్యను తీసుకొచ్చారు. ఆమెను కూడా ఉంచుతారో లేదంటే తీసేస్తారో తెలియదు. అసలెందుకు ఇలా మారుస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. గతంతో పోలిస్తే మంగళగిరిలో నారా లోకేష్ చాలా స్ట్రాంగ్ అయ్యారనడంలో సందేహం లేదు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా ఆయన మాత్రం నియోజకవర్గాన్ని వీడలేదు. సమస్య ఉన్నప్పుడల్లా అక్కడ వాలిపోయారు. దీంతో ప్రజల్లో లోకేష్‌పై అభిమానం పెరిగింది.
ఎందుకు మేకపోతు గాంభీర్యాలు..?
ఈసారి ఎన్నికల్లో నారా లోకేష్ విజయం ఖాయమనే ప్రచారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆయనపై గట్టి అభ్యర్థిని నిలబెట్టాలన్న తాపత్రయమో మరొకటో కానీ అభ్యర్థుల మీద అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఇప్పటి వరకూ మంత్రులంతా లోకేష్‌ను అవహేళను చేస్తూ మాట్లాడారు. మరి పార్టీ అధినేత వచ్చేసేమో అభ్యర్థుల మీద అభ్యర్థులను మార్చేస్తున్నారు. అంటే నారా లోకేష్ సత్తా ఏంటో జగన్‌కు ఈపాటికే అర్థమైపోయినట్టే కదా. మరి పైకి ఎందుకు మేకపోతు గాంభీర్యాలు..? ఎలాగూ గెలవలేమని ఫిక్స్ అయిపోయి.. ఎదుటి వారిని నైతికంగా దెబ్బకొట్టి విజయం సాధించాలనుకుంటున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.