చేతులారా.. లేకుంటే సోషల్ మీడియా దెబ్బకా మహాసేనా..!
ఒకటా.. రెండా.. లెక్కలేనన్ని వివాదాలు.. ఒక్క యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఫేమస్.. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది. అదిగో అలా టీడీపీ తరపున టికెట్ ప్రకటించారో లేదో.. ఇక సోషల్ మీడియాలో షురూ అయింది.. ఏ మాధ్యమం ద్వారా పాపులర్ అయ్యారో.. అదే మాధ్యమం దెబ్బకు ఇప్పుడు సీటు సిరిగిపోయింది.! అటు అధికార పార్టీ వైసీపీ.. ఇటు సొంత మనుషులు.. టీడీపీ, జనసేన నుంచి ఎటు చూసిన విమర్శలు.. ఆరోపణలే..!
ఇదీ సంగతి!
రాజకీయాల్లో వివాదరహితులు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది మాత్రమే ఉంటారు. అలాగని ఎవరూ సరికాదని అనలేం. కానీ కొందరు మాత్రం వివాదాలకు కేరాఫ్‌గా ఉంటారు. వారు జనం మనసు దోచుకునే.. వారికి కావల్సిన సాయం అందజేసో హాట్ టాపిక్ అయితే ఓకే కానీ ఎప్పటికీ ఏదో ఒక విషయాన్ని పట్టుకుని దాన్ని కాంట్రవర్సీ చేసి వార్తల్లో ఉంటే మాత్రం కష్టం. అలా ఏపీలో ఓ వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెగ పాపులర్ అయ్యారు. అంటే ఏదో జనాలకు ఉపయోగపడే కంటెంట్ ద్వారా కాదు.. వాళ్లను తిట్టి.. వీళ్లను తిట్టి మొత్తానికి పాపులారిటీ అయితే సంపాదించారు. ఆయనెవరో మీకు ఇప్పటికే అర్థమై పోయి ఉంటుంది. ఆయన మరెవరో కాదు.. మహాసేన రాజేష్.
బ్రాహ్మణ వర్గమంతా రివర్స్..
రాజేష్‌కు పి.గన్నవరం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కేటాయించింది. అసలు ఆయనకు టికెట్ ఎందుకు కేటాయించారనేది అధినేత చంద్రబాబుకే తెలియాలి. స్థానిక నేతలందరినీ పక్కనబెట్టేసి స్థానికేతరుడైన ఆయనకు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో సర్వత్రా నిరసన వెల్లువెత్తింది. ఇదొక్కటే కారణం కాదు.. ఆయన చేసిన చాలా విమర్శలు.. పార్టీలనే కాదు.. ఉన్నత వర్గాలకు చెందిన వారిని కూడా విమర్శించేలా ఉన్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణవర్గాన్ని. ఇప్పుడు ఆ వర్గమంతా రివర్స్ అయ్యింది. సంస్కారం లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటని బ్రాహ్మణ సంఘాలు సైతం ప్రశ్నించాయి. దళితులలోనే ఉత్తముడికి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశాయి. పైగా ఆయన ఒకానొక సమయంలో జనసేన పార్టీని సైతం ఏకిపారేశారు. దీంతో రాజేశ్‌కు టికెట్ కేటాయించడాన్ని జనసేన నేతలు సైతం వ్యతిరేకించారు.
పెద్దగా ఇమేజ్ ఏమీ లేదు..
మహాసేన రాజేశ్‌కు టికెట్ రద్దు చేయాలని.. రాజేశ్ గో బ్యాక్ అంటూ నినాదాలతో పి.గన్నవరం అట్టుడికిపోయింది. జనసేన నేతలు రచ్చ రచ్చ చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే మహాసేన రాజేష్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు వెలిశాయి. ఈ నేపథ్యంలో తాను పోటీ చేసినా గెలవడం అసాధ్యమనుకున్నారో ఏమోకానీ మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఐతే ఇదంతా దళిత వర్గానికి తోక్కడానికే జరుగుతోందని.. ఇంకెన్నాళ్ళు ఇలా అంటూ సీఎం జగన్ రెడ్డినీ తిట్టిపోసారు రాజేష్. రాజేష్ ఎక్కడున్నా కూడా కాంట్రవర్సీలే. ఏ పార్టీలో ఉంటే ఆ పాట పాడుతూ.. ఎదుటి పార్టీలను విమర్శిస్తూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంత పేరు అయితే వచ్చింది కానీ అంతకు మించి రాజేష్‌కు పెద్దగా ఇమేజ్ ఏమీ లేదు. అలాంటి రాజేష్‌కు టికెట్ ఇచ్చే ముందు చంద్రబాబే ఒకసారి ఆలోచించుకుని ఉండాల్సిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాంటి వారిని నిలబెట్టి అనవసరంగా వ్యతిరేకతను కొనితెచ్చుకోవడమే అంటున్నారు. ఐతే చేతులారా మహాసేన చేసుకున్నాడని కొందరు అంటుంటే.. ఇంకొందరేమో సోషల్ మీడియా దెబ్బ.. రాజేష్ అబ్బా అని నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు.