బిడ్డొచ్చిన వేళ.. గొడ్డొచ్చిన వేళ అంటారు. ఏ ముహూర్తాన.. టీఆర్ఎస్‌ను కాస్తా బీఆర్ఎస్‌గా మార్చారో కానీ గులాబీ పార్టీకి అప్పటి నుంచే వరుస కష్టాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడైతే పరిస్థితి మరీ దారుణం. దొరల మాదిరిగా తెలంగాణను పాలించిన గులాబీ బాస్ కేసీఆర్ కంటికే కనిపించడం మానేశారు. అందరూ మొత్తుకోగా.. ఒక సభను నిర్వహించి గాయబ్ అయ్యారు. ఇక ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆసక్తికరం అనే కంటే షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ పార్టీకి నిలబెట్టేందుకు ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదట. హతవిధీ.. నిన్న మొన్నటి వరకూ ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్‌కా ఈ రోజు ఈ విషమ పరీక్ష? అని జనం విస్తుబోతున్నారు.
తెలంగాణలో రేవంత్ మేనియా..
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవడం అంటే ఏంటో తెలంగాణ ప్రజానీకం ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఏమాత్రం తెలంగాణలో దశాబ్ద కాలంగా సత్తా చూపలేకపోయిన కాంగ్రెస్ పార్టీ వచ్చేసి అధికారంలో కూర్చొంది. మేము తప్ప తెలంగాణకు మరో దిక్కే లేదనుకున్న బీఆర్ఎస్ వచ్చేసి పాతాళానికి కూరుకుపోయింది. కనీసం బాగా డబ్బు పెట్టగల సిట్టింగ్ ఎంపీలు సైతం ఎందుకొచ్చిన గొడవలే.. గెలుస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో డబ్బు తగలేసుకోవడం ఎందుకని పోటీకి ఆసక్తి చూపించడం లేదట. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ మేనియా నడుస్తోంది. కాబట్టి పోగొట్టుకోవడం కంటే ఉన్నది కాపాడుకోవడం బెటరనే ఆలోచనలో గులాబీ నేతలు ఉన్నారట.
ఎడా పెడా పథకాలు..
ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే హవా అని సర్వేలు తేలుస్తున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి ఎడా పెడా పథకాలు ప్రవేశ పెడుతున్నారు. డబ్బెక్కడి నుంచి తెస్తారులే పథకాలు అటకెక్కడం ఖాయమని భావిస్తే ఆయన మాత్రం ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను సైతం ప్రారంభించేశారు. ఇక అది చేయలేదు.. ఇది చేయలేదనేందుకు ఆస్కారం కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాలి? వారికి కూడా కొంత ఛాన్స్ ఇవ్వాలి కదా.. రేవంత్‌కైతే ఓ పద్ధతి పాడూ ఏమీ లేదు. విపక్షానికి ఆస్కారమే ఇవ్వడం లేదు. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అని గులాబీ నేతలు సైడ్ అయిపోతున్నారట.
డబ్బు ఖర్చు పెట్టినా గెలిచే ఛాన్స్ లేదు..
అందుకే ఎన్నికల్లో పిలిచి టికెట్ ఇస్తామన్నా కూడా బీఆర్ఎస్ నేతలు మాకొద్దు బాబోయ్.. అంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరించి షెడ్యూల్ కూడా రాకమునుపే దాదాపు జాబితాను రివీల్ చేసేసి.. నేతలందరి ప్రచార బరిలోకి గులాబీ బాస్ దింపేశారు. కానీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్నా కానీ పార్టీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థి పేరు కూడా బయటకు రాలేదు. కొన్ని పేర్లు బయటకు వచ్చినా కూడా వారెవరూ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని టాక్. కనీసం సిట్టింగ్‌లు సైతం ముందుకు రావడం లేదట. బీభత్సంగా డబ్బు ఖర్చు పెట్టినా గెలుస్తామన్న ధీమా లేకపోవడంతో నేతలు పునరాలోచనలో పడిపోయారట.