నిన్న మొన్నటి వరకూ వైసీపీ నుంచి వలసలు నడిచాయి. ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు వలసలు ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రారంభమయ్యాయి. జనసేన, టీడీపీల నుంచి టికెట్ దక్కదని భావించిన నేతలంతా మరో దారి వెదుక్కుంటున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసే నేతలెవరూ ఇప్పుడు లేరు. కేవలం స్వప్రయోజనాలే పరమావధి. ఏపీలో టీడీపీ-జనసేన తొలి జాబితా తర్వాత అసంతృప్త నేతలు కొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. పొత్తులో భాగంగా తమకు టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్న నేతలు సైతం తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఇప్పుడైతే టీడీపీలో వలసలు ప్రారంభమయ్యాయి.
జనసేన ఖాతాలోకి రాజోలు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. తెలుగుదేశం పార్టీని వీడారు. ఈ క్రమంలోనే అధినేతకు తన రాజీనామా లేఖను పంపించారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రాజోలు.. జనసేన ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో తనకు టికెట్ దక్కదని భావించిన సూర్యారావు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన విజయవాడ వెళ్లి ఎంపీ కేశినేని నానికి చెందిన భవన్‌లో ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డితో భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఏం సంకేతాలు అందాయో ఏమో కానీ పార్టీకి రాజీనామా చేయాలని ఆ వెంటనే డిసైడ్ అయ్యారు. పార్టీ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు.
వైసీపీకి వెన్నుదన్నుగా రాపాక..
మరికొన్ని గంటల్లో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో గొల్లపల్లి సూర్యారావు భేటీ అవుతారట. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఏ రాజోలు సీటు అయితే తనకు దక్కదని ఆయన టీడీపీకి రాజీనామా చేశారో.. ఆ సీటు వైసీపీలో అయినా దక్కుతుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు పోటీ చేశారు. అప్పట్లో ఇదే గొల్లపల్లి.. రాపాకపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత రాపాక జనసేనను వీడి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను కాదని.. గొల్లపల్లికి జగన్ రాజోలు టికెట్ ఇస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.