దర్శకుడి క్రిష్ తాను రాడిసన్ హోటల్ పై పోలీసులు దాడి చేసిన సమయంలో సాయంత్రమే వెళ్లి స్నేహితుణ్ని కలిసి వచ్చేసాను, నాకు ఈ డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధము లేదు అంటూ తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం గచ్చిబౌలి లోని రాడిసన్ హోటల్ లో మాదక ద్రవ్యాలు సేవిస్తూ కొంతమంది పట్టుబడ్డారు. అందులో మోడల్ లిపి గణేష్, వివేకానంద మరికొందరు ఉన్నారు. అయితే ఈకేసులో దర్శకుడు క్రిష్ కూడా ఉన్నాడు, క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడు, వివేకానంద ఇచ్చిన పార్టీకి క్రిష్ హాజరయ్యాడు, ప్రస్తుతం క్రిష్ పరారీలో ఉన్నాడు అంటూ మీడియాలో వార్తలు రావడంతో వెంటనే క్రిష్ లైన్ లోకి వచ్చి నేను రాడిసన్ హోటల్ కి వెళ్లిన మాట వాస్తవమే, కానీ నేను వివేకానందంతో కలిసి కొద్దిసేపే మాట్లాడి 6.45 కి హోటల్ నుంచి బయటికి వచ్చేసాను, ఈ విషయం పోలీసులకి చెప్పాను అన్నారు.
కానీ డీసీపీ డాక్టర్ వినీత్ ఈకేసు పై స్పందిస్తూ.. వివేకానంద ఈ హోటల్లో గతంలో చాలాసార్లు పార్టీలు ఇచ్చాడు. ఈ హోటల్ కి కొకైన్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ ని అదుపులోకి తీసుకున్నాము, గతంలో వివేకానంద్ కి డ్రగ్స్ సప్లై చేసినట్లుగా, పలుమార్లు పార్టీలు జరిగినట్లుగా సయ్యద్ అబ్బాస్ చెప్పాడు. ఈ కేసులో శ్వేతా, సందీప్ పరారీలో ఉన్నారు, చరణ్ తాను బెంగుళూరులో ఉన్నాను వస్తున్నాను అని చెప్పాడు, డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో దర్శకుడు క్రిష్ కూడా ఉన్నాడు.
క్రిష్ డ్రగ్స్ టెస్ట్ కి వస్తాను అని చెప్పాడంటూ సంచలన విషయాలను రివీల్ చేసాడు. దర్శకుడు క్రిష్ కి డ్రగ్స్ పరీక్షలు చేస్తాము, రక్త, మూత్ర పరిక్షలు చేసి డ్రగ్స్ తీసుకున్నాడో, లేదో పరీక్ష చేస్తాము, విచారిస్తాము, అంతేకాకుండా వివేకానంద్ ఈ డ్రగ్స్ పార్టీలు ఎలా నిర్వహిస్తున్నాడో కనిపెడతాము అంటూ డాక్టర్ వినీత్ చెప్పుకొచ్చారు.