టీడీపీ, జనసేన పొత్తు బాగానే ఉంది కానీ సీట్ల పంపకానికి వచ్చే వరకూ చిక్కులు ఎదురవుతున్నాయి. జనసేన ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతోందని టాక్. అయితే టీడీపీ మాత్రం బీజేపీకి కూడా కొన్ని ఇవ్వాలి కాబట్టి కాస్త ఆచి తూచి వ్యవహరిస్తోందని సమాచారం. అడిగినన్ని ఇచ్చేస్తే.. టీడీపీ నేతలతో సమస్య వస్తుంది. ఏపీలో టీడీపీ నేతలు ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీని వీడే ఆలోచన మాత్రం చేయలేదు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు వారందరికీ న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి సీట్ల పంపకం విషయంలో జాగ్రత్త వహిస్తున్నారని టాక్.
తలనొప్పి తెచ్చి పెడుతున్న పొత్తు..
జనసేన పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ టికెట్ రాకుంటే నేతలు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. కాబట్టి కాస్త ఎక్కువగానే సీట్లు రాబట్టుకోవాలని యత్నిస్తోంది. అయితే బీజేపీ మధ్యలో లేకుంటే ఇరు పార్టీలకు అంత ఇబ్బంది ఉండేది కాదు కానీ ఆ పార్టీతో పొత్తు సీట్ల పరంగా తలనొప్పి తెచ్చి పెడుతోంది. పొత్తులో భాగంగా జనసేన వచ్చేసి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో దాదాపు 15 స్థానాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తొమ్మిది స్థానాల్లో మాత్రమే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన జిల్లాల విషయానికి వస్తేనే తలనొప్పి ప్రారంభమవుతోంది. కృష్ణా జిల్లా విషయానికి వస్తే విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ కావాలని జనసేన కోరుతోంది.
చాలా స్ట్రాంగ్ కేండిడేట్..
అయితే విజయవాడ పశ్చిమ కోసం టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇక్కడ నుంచి గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచింది కాబట్టి ఆ స్థానం తమకు కావాలని కోరుతున్నారు. అడగొచ్చు తప్పు లేదు కానీ చెబుతున్న లాజిక్కే కరెక్ట్‌గా లేదు. అవనిగడ్డలో కాపు సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి అడిగినా తప్పు లేదు. గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ టీడీపీ నుంచి మండలి బుద్దప్రసాద్ ఉన్నారు. ఆయన చాలా స్ట్రాంగ్ కేండిడేట్. అలాగే గుంటూరు ఈస్ట్, వెస్ట్ సీట్లలో ఒకటి జనసేన కోరుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనీసం రెండైనా ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఇక రాయలసీమలో ఆరు స్థానాలు.. అలాగే అనంతపురం టౌన్, పుట్టపర్తి, కడప విషయానికి వస్తే రాజంపేట లేదా బద్వేల్ కోరుతోంది. మరి ఈ సీట్ల లొల్లి ఎలా జరుగుతుందో.. పార్టీ నేతలు ఎలా సమన్వయం చేసుకుంటారో చూడాలి.