మెగాస్టార్ చిరంజీవిని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా డాడీ అని పిలుస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి వరుణ్.. చిరు దగ్గరే ఎక్కువగా పెరగడంతో పాటు.. నాగబాబుకి చెప్పలేని విషయాలను కూడా చిరుకే ఎక్కువగా చెబుతూ ఉండేవాడట. ఈ విషయం స్వయంగా మెగాస్టారే రీసెంట్‌గా జరిగిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ వేడుకలో తెలిపారు. కాకపోతే.. ఈ మధ్య తను పెళ్లి చేసుకున్న లావణ్య వ్యవహారం, అదే ప్రేమ వ్యవహారం మాత్రం చిరంజీవికి చెప్పలేదట. అందుకు వరుణ్‌పై కోపంగా ఉందంటూ చిరు సరదాగా చెప్పుకొచ్చారు. చిరు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
వరుణ్ మొదటి నుంచి నాతో చనువుగా ఉంటాడు. వాళ్ల నాన్నకు చెప్పలేని విషయాలు కూడా నాతో చెప్పేవాడు. అన్నింటికీ నేనే స్ఫూర్తి అనేవాడు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం నా దగ్గర దాచాడు. అందుకు నాకు వాడిపై కోపంగా ఉంది.. అని చిరు అంటే.. దీనికి వెంటనే స్పందించిన వరుణ్.. అది భయంతో కూడిన గౌరవం డాడీ అని చెబుతూ.. అప్పటికీ నా ప్రేమ విషయాన్ని ముందుగా డాడీ(చిరు)తోనే చెప్పడం జరిగిందని వివరణ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఆసక్తికరమైన సంభాషణతో స్టేడియం క్లాప్స్‌తో హోరెత్తగా.. ఈ వీడియో చూసిన వారంతా.. కొడుకేగా కోపమెందుకు చిరు అంటూ.. అంతే సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్ నుంచి వస్తోన్న మరో వైవిధ్యభరిత చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మార్చి 1న విడుదల కాబోతోన్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు. పుల్వమా ఘటనని హైలెట్ చేస్తూ.. ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను విజువల్ ఫీస్ట్‌లా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. మానుషి చిల్లర్, నవదీప్, అభినవ్ గోమఠం వంటివారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌కు ఎంతో ముఖ్యమైనది.