నిన్న మొన్నటి వరకూ టికెట్ టెన్షన్ వైసీపీలో ఉండేది. ఇప్పుడు దాదాపు అభ్యర్థుల ఖరారు వైసీపీ పూర్తి చేసింది. అక్కడ టెన్షన్ దాదాపూ ఓవర్. ఇప్పుడు టీడీపీలో టెన్షన్ ప్రారంభమైంది. మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు 95 పేర్లతో జాబితా విడుదల చేశారు. అయితే ఆ జాబితాలో తిరిగి కాస్త మార్పులు చేర్పులు ఉంటాయని టాక్ నడుస్తోంది. దీనికి తోడు సర్వేలు ఒకటి నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ పేరిట మాత్రమే కాకుండా ఇతర నేతల పేర్లతో సర్వే నిర్వహించినా కూడా సీనియర్లు కంగారు పడుతున్నారు. ఆ టెన్షన్ పడుతున్న వారిలో పెద్ద లిస్టే వైరల్ అవుతోంది. వీరిలో టికెట్లు దక్కిన వారు కూడా ఉండటం విశేషం. ఐవీఆర్ఎస్ పేరిట టీడీపీ చేయిస్తున్న సర్వే చర్చనీయాంశంగా మారింది.
వేరే పేర్లతో సర్వేలు...
పెనమలూరులో దేవినేని ఉమ, నరసరావుపేటలో యరపతినేని, గురజాలలో జంగా కృష్ణమూర్తి, పెనమలూరులో ఎంఎస్ బేగ్ పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. గురజాల, పెనమలూరుల్లో వేరే పేర్లతో కూడా సర్వేలు నిర్వహిస్తుండటమే.. దేవినేని, యరపతినేనిల్లో ఆందోళనకు గురి చేస్తోంది. తాము కావాలనుకున్న నియోజకవర్గాల్లో వేరే పేర్లతో సర్వే చేస్తుండటంతో ఒకవైపు బుద్ధా వెంకన్న.. మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు విపరీతంగా ఆందోళనకు గురవుతున్నారట. ఇక సర్వేపల్లి నుంచి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరుతో తాజాగా ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయని సమాచారం. ఇక ఒకొక్కరి పేరు మీద అయితే మూడు నుంచి నాలుగు చోట్ల సర్వేలు నిర్వహిస్తున్నారట.
ఎక్కడా పేరు వినిపించకపోవడంతో..
ఆనం పేరుతో గతంలోనే మూడు చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించింది. వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు సెగ్మెంట్లల్లో ఆనం పేరిట సర్వేలు నిర్వహించడం జరిగింది. సీనియర్ నేత కళా వెంకట్రావు సైతం ఎక్కడా తన పేరు వినిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారట. మరోవైపు దెందులూరులో చింతమనేని కూతురు పేరిట సర్వే జరుగుతోంది. తన పేరు లేకపోవడంపై చింతమనేని టెన్షన్ అవుతున్నారట. అనకాపల్లి టికెట్ ఆశించిన పీలా గోవింద్, పెందుర్తి టికెట్ ఆశిస్తున్న బండారు సత్యనారాయణ మూర్తి, ఉంగుటూరు టికెట్ ఆశిస్తున్న గన్ని వీరాంజనేయులు, కొవ్వూరు టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి జవహర్ ఆందోళన చెందుతున్నారు. గంటా భీమిలి టికెట్ ఆశిస్తే ఆయనకు చీపురుపల్లి టికెట్‌ను అధిష్టానం కేటాయించింది. మొత్తానికి టీడీపీ నేతలంతా ఏదో ఒక టెన్షన్ అయితే పడుతూనే ఉన్నారు.