సినిమా హీరో, ప్రముఖ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా ఓ లేఖని విడుదల చేసారు. గతంలో టీడీపీకి, ఆతర్వాత జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న మంచు ఫ్యామిలీ ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు ఏ రాజకీయ పార్టీతో దోస్తీ చెయ్యడం లేదు. అయితే రాజకీయాల్లో తన పేరుని వాడుకుంటున్న వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా నా పేరుని వాడుకుంటున్నారంటూ ఫైర్ అవుతూ ఓ లేఖని విడుదల చేసారు.
ఆ లేఖలో మోహన్ బాబు ఇలా వ్రాసుకొచ్చారు.. ఈ మధ్య కాలంలో రాజకీయంగా నా పేరుని ఉపయోగిస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారు నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామని.. ఎవరి అభిప్రాయాలు వారికీ ఉంటాయి. అవి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే దృష్టిపెట్టాలి కానీ, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం అంటూ మోహన్ బాబు తనకి అండగా నిలబడిన వారందరికీ ఈలేఖ లో ధన్యవాదాలు తెలియజేసారు.
మంచు విష్ణు నిర్మాణ సారథ్యంలో మోహన్ బాబు కన్నప్పలో నటిస్తున్నారు. అలాగే మోహన్ బాబు విద్యా సంస్థలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోహన్ బాబు వైసీపీకి కొమ్ము కాస్తున్నారనే ప్రచారంతో పాటుగా.. రాజకీయాల్లో ఆయన పేరుని వాడుకుంటున్న వారిని ఈ లేఖతో హెచ్చరించారు.