సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఓఆర్ఆర్‌పై లాస్య నందిత కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే మరణించగా... కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఎస్సీకి కేటాయించిన ఏకైక సెగ్మెంట్..
దేశంలోనే సైనికుల ఆధీనంలో ఉన్న అతిపెద్ద కంటోన్మెంట్ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రెండున్నర లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జి.సాయన్న అకాల మరణంతో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయ్యింది. ఆ తరువాత ఆ స్థానం కోసం ఆరుగురు పైనే పోటీ పడ్డారు. వారిలో హేమాహేమీలు కూడా ఉన్నారు. నిజానికి హైదరాబాద్ జిల్లాలో ఎస్సీకి కేటాయించిన ఏకైక సెగ్మెంట్ అది. దీంతో పోటీలో తీవ్రత పెరిగింది. అన్ని విధాలుగా ఆలోచించిన గులాబీ బాస్ కేసీఆఱ్ సాయన్న కూతురైన లాస్య నందితకే టికెట్ ఇచ్చారు. ముఖ్యంగా సాయన్న కూతురికి టికెట్ ఇస్తే సానుభూతి ఓట్లు బాగా పడతాయని కేసీఆర్ భావించారు.
సాధారణ కార్పొరేటర్ నుంచి..
పైగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర సాయన్నది దీంతో ఆయన సేవలను గుర్తించి ఇచ్చినట్టుగా కూడా ఉంటుందని కేసీఆర్ భావించారు. అలా చాలా మందితో పోటీ పడి మరీ కంటోన్మెంట్ టికెట్‌ను దక్కించుకుని లాస్య నందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ పట్టుమని ఏడాది పాటు కూడా ఎమ్మెల్యేగా ఆమె తన పదవిని అనుభవించలేకపోయారు. ఒక సాధారణ కార్పొరేటర్ స్థాయి నుంచి ఏకంగా ఎమ్మెల్యేగా ఎదిగారు. ఇటీవల గులాబీ బాస్ కేసీఆర్ నల్గొండ సభకు వెళుతుండగా కూడా లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. నేడు తిరిగి ప్రమాదానికి గురవడంతో ఆమె దుర్మరణం పాలయ్యారు.