మంచి వక్తకుండే లక్షణం.. ఏకధాటిగా ఒకే లెవల్లో మాట్లాడకూడదు. మాటల్లో హెచ్చుతగ్గులుండాలి. అలాగే తన మాటల్లో హాస్యాన్ని జోడించాలి. అప్పుడే వినేవారికి సరదాగా ఉంటుంది. చెప్పేవారికి ఊపొస్తుంది. లేదంటే బోర్ కొడుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సతీమణి సైతం ఇలాగే మాట్లాడుతున్నారు. ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు. మధ్యమధ్యలో కొన్ని తన లైఫ్‌లో జరిగిన సరదా సన్నివేశాలు చెబుతున్నారు. సరదా సరదా ప్రశ్నలు అడుగుతున్నారు. మొత్తానికి ఒక పొలిటీషియన్ మాదిరిగా కాకుండా మన ఇంట్లోని వ్యక్తి మనతో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే మాట్లాడుతున్నారు.
చంద్రబాబుకు ఓటేస్తారా? నాకు ఓటేస్తారా?
నారా భువనేశ్వరి అలా మాట్లాడటం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆమె ప్రసంగంపై చర్చలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న చంద్రబాబు తనకు ప్రేమతో కొనుక్కొచ్చిన చీర మేటర్ చెప్పి నవ్వించారు. ఇక ప్రస్తుతం నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సరదా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి.. వచ్చే ఎన్నికల్లో తాను నిలబడతానని అన్నారు. ‘చంద్రబాబుకు ఓటేస్తారా? నాకు ఓటేస్తారా?’ అని భువనేశ్వరి సరదాగా కార్యకర్తలను అడిగారు. అక్కడున్న వారంతా సరదాగా తీసుకున్నారు. అంతటితో మేటర్ ఓవర్ అనుకున్నాం.
చమత్కారమో.. యథాలాపమో కాదట..
అయితే నీలి మీడియా అలా వదులుతుందా? చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదని.. ఏవేవో వాగ్దానాలు చేసి నెరవేర్చలేదని అందుకే బాబుకు బైబై చెప్పేందుకు కుప్పం ప్రజలు సిద్ధమయ్యారని.. ఈ క్రమంలోనే భువనేశ్వరి రంగంలోకి దిగి తాను పోటీ చేస్తానంటూ హింట్ ఇచ్చారని కథనాలు వండి, వార్చడం స్టార్ట్ చేసింది. ఓటమి స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో చంద్రబాబు తప్పుకోవాలనుకుంటున్నారని అందుకే భువనేశ్వరితో అలా చెప్పించారట. అంతే తప్ప అవి చమత్కారమో.. యథాలాపమో కాదట. ఇలాంటి విన్నప్పుడే అనిపిస్తుంది.. ‘వీళ్లనెవరికైనా చూపించండిరా’ అని.