మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ అధిష్టానంపై సీరియస్ అయిపోయి పార్టీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.. వైసీపీతో పాటు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు తిరిగి ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట ఆర్కేతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో చర్చల అనంతరం జగన్‌ను కలవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఆర్కే తిరిగి వైసీపీ గూటికి ఎందుకు చేరుకోవాలనుకుంటున్నారు? దీని వెనుక చక్రం తిప్పిందెవరు? వంటి విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
వైసీపీలో తిరిగి చేరేలా ఒప్పించిన అయోధ్య రామిరెడ్డి..
ఆళ్లను సొంత గూటికి తీసుకురావడంలో రాజ్యసభ సభ్యుడు, ఆయన సోదరుడు అయిన అయోధ్య రామిరెడ్డి కీలక పాత్ర పోషించారని సమాచారం. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఏమాత్రం పట్టు లేదు. షర్మిల పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. ఈ క్రమంలోనే అయోధ్య రామిరెడ్డి జగన్‌కు ఆళ్లకు మధ్య రాయబారం నడిపారు. మంగళగిరి టికెట్ ఇవ్వకున్నా కూడా కీలక పదవి ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. ఇదే విషయాన్ని తెలిపి అయోధ్య రామిరెడ్డి వైసీపీలో తిరిగి చేరేలా ఆళ్లను ఒప్పించినట్టు సమాచారం. ఇప్పుడు ఆర్కే కూడా వచ్చి చేరడంతో తిరిగి మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను సులభంగా ఓడించవచ్చని వైసీపీ భావిస్తోంది.
టీడీపీ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన తరుణమిదే..
మొత్తానికి మంగళగిరి గ్రూపులతో అట్టుడుకుతోంది. ఆళ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ తరుణంలో నారా లోకేష్‌ను ఓడించడం చాలా కష్టమని భావించిన వైసీపీ అధిష్టానం తిరిగి ఆళ్లను సొంతగూటికి తీసుకురావడంలో సఫలమైందనే చెప్పాలి. ఇక మంగళగిరిలోని గ్రూపులను కూడా సెట్ చేస్తే టీడీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే టీడీపీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇప్పటికే ఆళ్ల మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి విజయం సాధించారు. కాబట్టి ఆయనకు మంగళగిరిపై మంచి పట్టుంది. పైగా 2019 ఎన్నికల్లో నారా లోకేష్‌పై పోటీ చేసి విజయం సాధించారు. అయితే మంత్రి వర్గంలో ఆయనకు అవకాశం కల్పించకపోగా.. గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో ఆళ్ల పార్టీని వీడారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి రానుండటంతో వైసీపీలో జోష్ పెరిగింది.