ఎన్నికలకు రెండు రోజుల ముందు తాయిలాలు పంచడం ఏ పార్టీ అయినా చేసేదే. కానీ వైసీపీ ఈ విషయంలో సూపర్ ఫాస్ట్‌గా ఉంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిని పక్కనబెట్టి.. వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇక ఓటింగ్‌లో తమకు సహకరిస్తారనుకున్న ప్రతి ఒక్కరికి తాయిలాలు పంచడం మొదలు పెట్టింది. దీనిలో ఎవరి స్టైల్ వారిదే. ఒకరికొకరికి పొంతన ఉండటం లేదు. ఒక్కొక్కరూ ఒక్కో సంచి పట్టుకున్నారు. వాటిలో గిఫ్ట్సే వెరైటీ. ఒక నేత వచ్చేసి ఎన్నికల చిహ్నమైన ఫ్యాన్ గుర్తు, జగన్, ఆ ప్రాంతంలో పోటీ చేస్తున్న తన ఫోటో ముద్రించిన సంచిలో రూ.2 వేల నగదు, కుక్కర్ సెట్, ఫ్లాస్క్ వంటి వాటిని పెట్టి వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ పంపిణీ చేశారు.
విందు భోజనం పెట్టి మరీ రిటర్న్ గిఫ్ట్స్..
ఇక మరో నాయకుడు.. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వచ్చేసి తన ఫోటోతో పాటు తన కుమారుడి ఫోటోలను సైతం ముద్రించిన సంచులలో సంక్రాంతి కానుకల రూపంలో కుక్కర్లను పంపిణీ చేసేశారు. ఇక మన సంబరాల రాంబాబు.. అదేనండి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి.. జగన్ ఫోటోలను ముద్రించిన పేపర్ కవర్‌లో ఒక టీ కప్పు, చీర, షర్ట్-ప్యాంటు పెట్టి తన సొంత నియోజకవర్గంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్రతినిధులను సైతం వదలకుండా విందు భోజనం పెట్టి మరీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇక జోగి రమేష్ మతం పేరును వాడేశారు. పుట్టుకతోనే ఏసు బిడ్డైన జగన్‌ను, తనను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు.
వైనాట్ 175 అని జగన్ ధీమాగా చెబుతుంటే..
ఇలా ఎవరికి తోచినట్టుగా వారైతే ముందుగా ప్రభుత్వోద్యోగులను, మీడియాను, వలంటీర్లను తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. వారి ద్వారా కథ నడిపించేందుకు సిద్ధమవుతున్నారు. వైనాట్ 175 అని జగన్ ధీమాగా చెబుతుంటే అంతా ఏమో అనుకున్నారు. కానీ ఈ విధంగా తాయిలాలు పంచి గెలుపునకు బాట వేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఇప్పటికే వలంటీర్లకు వైసీపీ రాజకీయ శిక్షణ ఇప్పించింది. ఆపై అవార్డుల పేరిట కోట్ల రూపాయలు పంచి పెట్టింది. ఇది చాలదన్నట్టుగా.. ఏ నేతకానేత ఇష్టానుసారంగా గిఫ్ట్స్ పంపిణీ చేస్తున్నారు. తాయిలాలే కాకుండా.. మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తోంది. ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే.. విజయం సాధించాలని గట్టి పట్టుదలతో వైసీపీ ఉంది.