బీజేపీ గేమ్ మొదలుపెట్టింది. ఇవాళ హైడ్రామాకు తెరదీసింది. సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన అనుబంధ సంఘాల అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన 9 అకౌంట్లనూ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం సీజ్ చేసింది. దీనికి కారణం ఏంటంటే.. 2018-19 లో ఆదాయ పన్ను శాఖ జరిమానా విధించిందట. దానికి సంబంధించి నోటీసులను సైతం జారీ చేసిందట. అయితే కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాలు ఇప్పటి వరకూ జరిమానా చెల్లించకపోగా.. నోటీసులకు స్పందన కూడా ఇవ్వలేదట. ఈ విషయం ఇప్పుడే సడెన్‌గా ఆదాయ పన్నుశాఖకు గుర్తొచ్చింది.. సీజ్ చేసి పడేసింది.
ఆ డబ్బు మొత్తం సీజ్..
అయితే ఆ కొద్ది సేపటికే మరో ట్విస్ట్. కాంగ్రెస్ పార్టీకి ఊరటనిస్తూ ఐటీ అప్పిలియేట్ ట్రిబ్యునల్ ఓ ప్రకటన జారీ చేసింది. ఇన్‌కం ట్యాక్స్ సీజ్ చేసిన అకౌంట్లను ఉపయోగించుకునేందుకు ఐటి అప్పిలియేట్ ట్రిబ్యునల్ అనుమతించింది. అయితే తమ పార్టీ అకౌంట్లను సీజ్ చేశారనగానే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఆగ్రహం పెల్లుబికింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున క్రౌడ్ ఫండింగ్ చేసింది. ఆ డబ్బును మొత్తం ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున కార్గే స్పందించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ - ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఖాతాలను సీజ్ చేయడమేంటి అంటూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు.
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజే..
బీజేపీ వసూలు చేసిన రాజ్యాంగ విరుద్ధమైన డబ్బును మాత్రం చక్కగా ఎన్నికల కోసం వినియోగిస్తారని.. తాము క్రౌడ్‌ఫండింగ్ ద్వారా సేకరించిన డబ్బుకు మాత్రం అవినీతి ముద్ర వేస్తున్నారని మల్లిఖార్జున కార్గే పేర్కొన్నారు. అందుకే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని చెప్పానని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. మొత్తంగా రూ.210 కోట్ల పన్ను రికవరీ నిమిత్తం ఆదాయపన్ను శాఖ వీటిని ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం గంటలోనే ఇన్‌కం ట్యాక్స్ సీజ్ చేసిన అకౌంట్లను ఉపయోగించుకునేందుకు ఐటి అప్పిలియేట్ ట్రిబ్యునల్ అనుమతించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఆ మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.