అసెంబ్లీ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు నడుమ ఏమైందో ఏమో కానీ తెలంగాణలో బీజేపీ స్లోగన్ మార్చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే అది వర్కవుట్ కాలేదు. తమ పార్టీని కాదు.. బీసీ నినాదాన్ని తెలంగాణ ఓటర్లు పట్టించుకోవడం లేదని బీజేపీ భావించినట్టుంది. ఈ ఎన్నికల్లో రూటు మార్చింది. ఈసారి లోక్‌సభ టికెట్‌లన్నీ అగ్రవర్ణాల అభ్యర్థులకే కేటాయించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
విమర్శలు గుప్పించిన సొంత పార్టీ నేతలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందర బీజేపీ అధిష్టానం రాంగ్ స్టెప్ వేసింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలోకి కిషన్ రెడ్డిని తీసుకొచ్చింది. ఫలితం ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీసీ అభ్యర్థిని తొలగించి రెడ్డి సామాజిక వర్గ నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంపై పెను దుమారమే రేగింది. సొంత పార్టీ నేతలు సైతం దీనిపై విమర్శలు గుప్పించారు. చాలా మంది నేతలు పార్టీని సైతం వీడారు. ఆ తరువాత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతే సీఎం అంటూ ప్రసంగాలు చేశారు. అయినా సరే.. జనం ఆ పార్టీని ఆదరించలేదు.
అగ్రవర్ణాలకే సీట్లు..
అన్ని పార్టీల కంటే ఎక్కువ మంది బీసీలకే బీజేపీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా కూడా ఫలితం శూన్యం. ఎంత మంది పార్టీని వీడుతున్నా కిషన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో తెలంగాణలో బీసీ స్లోగన్ వర్కవుట్ కాదని భావించిందో ఏమో కానీ బీజేపీ అధిష్టానం ఓసీ స్లోగన్ అందుకుంది. ఈ క్రమంలోనే అగ్రవర్ణాలకే సీట్లు కేటాయించాలని భావిస్తోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీసీలకు పెద్ద మొత్తంలో కోత పడే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం రెడ్లు గెలవడాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ సారి ఆ సామాజికవర్గానికే ఎక్కువ సీట్లు కేటాయించాలని వైసీపీ భావిస్తోంది.