ఏపీ రాజధాని విషయంలో జరుగుతోన్న వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం రాజధాని ఫైల్స్. ఈ చిత్రానికి వైసీపీ సెగ తగిలింది. ఎక్కడికక్కడ ఈ సినిమాను ఆపేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఈ చిత్ర ప్రదర్శన జరుగుతోన్న థియేటర్లకు రెవిన్యూ అధికారులు వెళ్లి.. సినిమాను నిలుపుదల చేయడం విశేషం. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఎలా అయితే వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందో.. సేమ్ టు సేమ్, ఇప్పుడు రాజధాని ఫైల్స్‌కి కూడా అడ్డుపడి.. ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
ఈ సినిమా విడుదలకు ముందు రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించి.. సెన్సార్ వారు చెప్పిన ఎన్నో మార్పులను చేసినట్లుగా దర్శకుడు భాను చెప్పుకొచ్చారు. సెన్సార్ అడ్డంకులను ఎదుర్కొని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఫిక్షనల్‌గా తెరకెక్కినప్పటికీ.. వైసీపీని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉండటంతో వెంటనే అలెర్ట్ అయిన ఏపీలోని అధికార పార్టీ, హైకోర్టు నుండి స్టే తెచ్చుకుని.. సినిమాని ఆపేస్తోంది. కొన్నిచోట్ల థియేటర్లలో సినిమా రన్ అవుతుండగానే.. ఆపేయడంతో ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. మరి.. ఇదే రెవిన్యూ అధికారులు యాత్రలకి, వ్యూహానికి ఎందుకు రియాక్ట్ కావడం లేదంటూ ప్రేక్షకులు అధికారులపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతానికైతే సినిమాని ఏపీ అంతటా ఆపేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మాత్రం ఇప్పటికే ఓ షో పూర్తవడంతో.. ఇందులోని విషయం పబ్లిక్‌లోకి వెళ్లిపోయింది.
శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో, కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చి.. ప్రస్తుతం అవస్థలు పడుతున్న రైతుల కోసం ఈ సినిమాను తీసినట్లుగా దర్శకుడు భాను తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.