ఆడలేక మద్దెల ఓడు అన్నాడంట జగన్‌లాంటోడొకడు. టీడీపీ అధినేత చంద్రబాబు కట్టిన రాజధానికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలన్న అహమో.. రాజధాని నిర్మాణం గావించిన వ్యక్తిగా చంద్రబాబు ఎక్కడ చరిత్రలో నిలిచిపోతాడోనన్న భావనో కానీ.. ఆయన కట్టించిన రాజధానిని పునాదులతో సహా పెకలించి వేయాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. దాని ఫలితమే మూడు రాజధానుల మాట. ఆ తరువాత అన్ని వనరులూ ఉన్నాయి. విశాఖను రాజధానిని చేస్తానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీని కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫల యత్నాలే.
నరంలేని నాలుక కదా..
కేసు సుప్రీంకోర్టులో నడుస్తుందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా విశాఖ రాజధానిగా ప్రకటిస్తూ డేట్‌ల మీద డేట్‌లు అనౌన్స్ చేశారు. అయినా సరే.. అనుకున్నది జరగలేదు. పైగా తనకోసం రూ.500 కోట్లు వెచ్చించి మరీ విశాఖలో ఇల్లు కట్టుకున్నారు. అది కూడా అవలేదు. ఇక ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అంటున్నారు. నరంలేని నాలుక కదా.. ఎన్నైనా మాట్లాడుతుంది. ఏదో తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి రచ్చ చేసి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకున్నారు. ఈ క్రమంలోనే వైవీ సుబ్బారెడ్డితో చిలక పలుకులు మీడియా ఎదుట పలికించారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది.
రాజధాని కావాలనడానికి సిగ్గు లేదా?
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడన్నట్టుగా.. వైసీపీ అధినేత ఏదో ఊహిస్తే మరింకేదో జరిగింది. జగన్ ఏ ఉద్దేశంతో అలాంటి పలుకులు వైవీ చేత పలికిస్తున్నారో తెలుగు రాష్ట్రాల ప్రజానీకం మొత్తానికి తెలిసిపోయింది. ఏపీ జనాలు అయితే జగన్ మీద మండిపడుతున్నారు. వైవీ చేత హైదరాబాద్ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని డిమాండ్ చేయించడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు. ఉన్న దానిని కూలదోసి.. దానిని అభివృద్ధి చేయలేక.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలనడానికి సిగ్గు లేదా? అని మండిపడుతున్నారు. పదేళ్లవుతున్నా కనీసం రాజధాని కూడా కట్టించుకోలేని దుస్థితి తమదని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. అటు రాజధానికి భూములిచ్చిన నేతలనూ ఇబ్బందులకు గురి చేశారు. కట్టిన రాజధానిని సర్వనాశనం చేయాలని చూశారు. మూడు రాజధానులన్నారు.. ఆపై హైదరాబాద్ రాజధాని అంటారా? అంటూ ఏపీ ప్రజానీకం మండిపడుతోంది.