ఒంగోలు రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ పి.భానుసాయి.. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్షను, భారీ జరిమానాను విధించారు. దీంతో ఒక్కసారిగా బండ్ల గణేష్ వార్తలలో హైలెట్ అవుతున్నారు. కొన్ని రోజులుగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వారిపై ఎలా విరుచుకుపడుతున్నారో తెలియంది కాదు. ఆయన తీరు చూసిన వారంతా.. కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనకు ఏదో పదవి రాబోతుందనేలా కామెంట్స్ కూడా చేస్తున్నారు. అలాగే బండ్ల గణేష్ చేసే కామెంట్స్ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
ఇప్పుడు బండ్ల గణేష్‌కి జైలు శిక్ష అనగానే.. వారే సోషల్ మీడియాలో ఆయన పేరు వైరల్ చేస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే.. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ రూ.95 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. ఇటీవల అతనికి బండ్ల గణేష్ ఓ చెక్‌ని ఇచ్చారు. ఆ చెక్‌ని క్యాష్ చేసుకునేందుకు బ్యాంక్‌లో వేయగా.. అది బౌన్స్ అయింది. దీంతో జెట్టి వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు.
కేసును విచారించిన ఒంగోలు రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ పి. భానుసాయి.. బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష, అలాగే రూ. 95.10 లక్షల జరిమానా విధించారు. జరిమానాలో రూ. 95 లక్షలు ఫిర్యాదు దారుడైన జెట్టి వెంకటేశ్వర్లుకు చెల్లించాలని తీర్పును వెల్లడించారు. అలాగే ఈ తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల పాటు కోర్టు గడువును కూడా ఇచ్చింది. మరిప్పుడు బండ్ల గణేష్ ఏం చేయబోతున్నారనేది చూడాల్సి ఉంది.