వివాదాలకు కేరాఫ్ అడ్రస్, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఏపీలోని అధికార పార్టీకి సపోర్ట్‌గా రెండు సినిమాలను చేశారు. అందులో ఒకటి వ్యూహం కాగా, రెండోది శపథం. వ్యూహం సినిమా విడుదల విషయంలో కోర్టు వరకు వెళ్లి.. మళ్లీ రీ సెన్సార్ చేయించుకుని విడుదలకు సిద్ధం కాగా, వ్యూహానికి కంటిన్యూషన్ అయిన శపథం సినిమాని కూడా లైన్‌లో పెట్టి విడుదల చేయాలని వర్మ వ్యూహ రచన చేస్తున్నాడు. అయితే వ్యూహం సినిమాకే వర్మకి చుక్కలు కనబడ్డాయ్. మరి అంత ఈజీగా శపథం వస్తుందా? అనేది డౌటే.
తాజాగా వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ డేట్స్‌ని ప్రకటించేందుకు వర్మ మీడియా సమావేశం నిర్వహించాడు. అందులో వ్యూహం ఫిబ్రవరి 23న, శపథం మార్చి 1న వస్తున్నట్లుగా పేర్కొన్నాడు. వ్యూహం ఓకేగానీ.. శపథంకు సెన్సార్ పూర్తయిందా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. శపథంపై కూడా కంప్లయింట్స్ వెళితే.. అది మళ్లీ వాయిదా పడే అవకాశం లేకపోలేదు. సరే ఆ సంగతి పక్కన పెడితే.. వ్యూహం, శపథం సినిమాలను జగన్ కోసం కాదు, పవన్-చంద్రబాబుల కోసం తీశానంటూ వర్మ చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఈ రెండు సినిమాల విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి నారా లోకేష్. ఆయన కారణంగానే డిసెంబర్‌లో రావాల్సిన ఈ సినిమాలు సరిగ్గా ఎన్నికలకు ముందు వస్తున్నాయి. డిసెంబర్‌లో వచ్చి ఉంటే.. అందరూ ఈ సినిమాలను మరిచిపోయేవారు. ఈ విషయంలో పరోక్షంగా నారా లోకేష్ హెల్పే చేశారు. ఎవరైనా ఏ సినిమా విడుదలనైనా కొన్నాళ్లు మాత్రమే ఆపించగలరు.. శాశ్వతంగా రిలీజ్ కాకుండా ఆపలేరు. వారం రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలు రిలీజ్ కావడం వల్ల ఇబ్బందే ఉండదు. నచ్చితే రెండు సినిమాలూ చూస్తారు. నచ్చకుంటే రెండూ చూడరు. సెన్సార్ వాళ్లు ఇందులో కొన్ని సీన్స్ తీసేశారు. అయినా కథలోని ఎమోషనల్ కంటెంట్ మాత్రం మిస్ కాలేదు. ప్రజా జీవితంలో ఉన్న కొందరి మీద మనకు కొన్ని అభిప్రాయాలుంటాయి. అలా నాకు ఉన్న అభిప్రాయాలతో వాస్తవ ఘటనల నేపథ్యంగా నేను వ్యక్తీకరించిన సినిమాలే వ్యూహం, శపథం.. అని వర్మ చెప్పుకొచ్చాడు.